ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మృతుడి కుమార్తె చందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పత్యర్ధి వర్గానికి ఎమ్మెల్యే, ఎంపీపీల సపోర్ట్ వుందని ఆరోపించారు.
వైసీపీ (ysrcp) నేత హత్యతో ఏలూరు జిల్లాలో (eluru district) ద్వారకా తిరుమల (dwaraka tirumala) మండలం జి.కొత్తపల్లిలో (g kothapalli) ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ హత్యకు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావే (talari venkata rao) కారణమంటూ ఆయనపై గ్రామస్తులు, మృతుడి బంధువులు దాడికి దిగారు. దీంతో పోలీసులు ఆయనను రక్షించేందుకు స్కూల్‌లో వుంచారు. దాదాపు నాలుగు గంటల పాటు తలారిని బయటకు రానీయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఆయనను చాకచక్యంగా గ్రామం దాటించారు పోలీసులు. ఈ సందర్భంగా మృతుడు గంజి ప్రసాద్ కుమార్తె చందు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో మరొక వర్గం తన తండ్రిని చాలా ఇబ్బందులు పెట్టారని ఆరోపించింది. 20 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి.. పీఎస్‌కు తీసుకెళ్లారని తెలిపింది. ఎమ్మెల్యే గతంలో రెండుసార్లు తన తండ్రిని కలవడానికి ఇష్టపడలేదని చందు ఆరోపించింది. గెలిపించిన వారే ఇలా చేయడంతో తనలో తానే కుమిలిపోయారని.. వ్యతిరేక వర్గాన్ని, ఎమ్మెల్యే, ఎంపీపీ పెంచి పోషించారని ఆమె ఆరోపించింది. ప్రతి విషయం తన తండ్రి తనతో షేర్ చేసుకునేవారని..కొన్నిసార్లు ఏకంగా రాజకీయాలే వదిలేస్తానని చెప్పేవారని చందు ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా.. జి కొత్తపల్లి వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. గంజి ప్రసాద్ వైసీపీ గ్రామ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకట్రావు.. హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జి కొత్తపల్లికి వెళ్లారు. అయితే ఎమ్మెల్యేను ప్రసాద్ వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మద్దతు ఓ వర్గానికి ఉండటం వల్లే హత్య జరిగిందని ఆరోపిస్తూ ప్రసాద్ వర్గీయులు ఎమ్మెల్యేపై దాడికి దిగారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. ఎమ్మెల్యేపై పిడిగుద్దులు కురిపించారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణ నిలిచారు. అతి కష్టం మీద ఎమ్మెల్యేను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. పోలీసులు పక్కకు తీసుకెళ్తున్న కూడా.. కొందరు ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఎమ్మెల్యే వెంకట్రావుకు వ్యతిరేకంగా నినాదాలు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో.. వారు గ్రామానికి అదనపు బలగాలను పంపారు.
ఇక, ఈ ఘటనపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. గంజి ప్రసాద్‌ను దారుణంగా హత్య చేశారని.. ఈ ఘటన చాలా బాధకరమని అన్నారు. ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై ఎస్పీతో మాట్లాడానని.. పోలీసులు విచారణ చేపట్టారని చెప్పారు. జి కొత్తపల్లిలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. మరోవైపు గంజి ప్రసాద్ హత్య కేసులో ముగ్గురు పోలీసులు ఎదుట లొంగిపోయారు.
