తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైసీపీ నేత, మాజీ కార్పోరేటర్ బూరడ భవానీ శంకర్‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. వైపీపీలో కీలకంగా వున్న ఆయన ప్రస్తుతం గడప గడపకు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం పట్టపగలు దారుణహత్య జరిగింది. వైసీపీ నేత, మాజీ కార్పోరేటర్ బూరడ భవానీ శంకర్‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు భవానీ శంకర్. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన ఆగంతకులు లోపలికి ప్రవేశించి కత్తులతో ఆయనను నరికిచంపారు. రక్తపు మడుగులో , తీవ్రగాయాలతో పడివున్న భవానీ శంకర్‌ను స్థానికులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భవానీ శంకర్ ప్రాణాలు కోల్పోయారు.
ఆయన పొట్ట, ఛాతీ, మెడపై తీవ్రగాయాలైనట్లుగా వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగి వుంటుందని పోలీసులు భావిస్తున్నారు. భవానీ శంకర్ గతంలో 48వ డివిజన్ కార్పోరేటర్‌గా పనిచేశారు. వైపీపీలో కీలకంగా వున్న ఆయన ప్రస్తుతం గడప గడపకు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. భవానీ శంకర్ మరణం పట్ల పలువురు వైసీపీ నేతలు సంతాపం తెలిపారు.
