పోరాడి సాధించుకోచ్చిన వీవీప్యాట్లలో మీరు ఎవరికీ ఓటు వేశారో కనిపించలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను ఫ్యానుకే ఓటేశానని, అది వీవీప్యాట్‌లో కనిపించిందని అంబటి తెలిపారు.

ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలకు గాను చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. తాను ఓడిపోతే అది తన పరిపాలన వల్ల కాదని దానిని ఈవీఎంలపై నెట్టేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తాను కేబినెట్ సమావేశం పెడుతున్నానని, సీఎస్ వస్తారో రారో చూస్తానంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మంత్రిమండలి సమావేశాన్ని 10 నుంచి 14వ తేదీకి ఎందుకు మార్చారని రాంబాబు ప్రశ్నించారు.

తాను ఓడిపోతున్న విషయం అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబని ఆ విషయం బయటికి రాకుండా సీఎం పిల్లిమొగ్గలు వేస్తున్నారని అంబటి ఎద్దేవా చేశారు. చిన్న గాలివానకే సచివాలయంలో బీభత్సం జరిగిందని.. ఇది మొదటిసారి కాదని రాంబాబు మండిపడ్డారు.

స్పీకర్ కోడెల  శాసనసభ కార్యాలయంలో సభ వ్యవహారాలు గురించి మాట్లాడాల్సింది పోయి రాజకీయ వ్యవహారాలను మీడియాతో పంచుకున్నారని ఇది ఎన్నికల కోడ్‌పే అతిక్రమించటమేనన్నారు.

పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఇంత వరకు కేబినెట్ సమావేశం పెట్టలేదని, ప్రధాని మోడీ కూడా ఈసీ అనుమతితోనే మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారని అంబటి మండిపడ్డారు.