Vijayawada: వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు, విధ్వంసకర పాలన రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తోందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు. గన్నవరంలో టీడీపీ నేతలు, కార్యాలయంపై జ‌రిగిన దాడిని ఆయ‌న  తీవ్రంగా ఖండించారు. ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించ‌డానికి ప్ర‌జ‌లు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.   

TDP national president N Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. గన్నవరం ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారుపై మండిప‌డ్డారు. వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు, విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. వైకాపా పాలన రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తోందని పేర్కొన్న చంద్ర‌బాబు.. గన్నవరంలో టీడీపీ నేతలు, కార్యాలయంపై జ‌రిగిన దాడిని ఆయ‌న తీవ్రంగా ఖండించారు.

అధికార వైసీపీ దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్ది నియంతృత్వ ధోరణి ప్రజాస్వామ్యానికి పెను విఘాతం కలిగిస్తోందని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీ అప్రజాస్వామిక ధోరణులను ప్రశ్నించినందుకు రాష్ట్ర ప్రభుత్వం హింసాత్మక చర్యలకు పాల్పడుతోందన్నారు. తప్పుడు కేసులు బనాయిస్తోందనీ, ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తోందని ఆరోపించారు. గన్నవరంలో జరిగిన దౌర్జన్యమే ఇందుకు తాజా ఉదాహరణ అనీ, గన్నవరంలో టీడీపీ నేతలను తీవ్రంగా హింసించారనీ, వారి ఆస్తులను పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు. బాధిత టీడీపీ నేతలను ప్రధాన నిందితులుగా చిత్రీకరించి జైలుకు పంపారనీ, వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికే తాను ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రస్తుత నియంతృత్వ పాలనలో సామాన్యుల ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు.. జీవితాంతం పోరాడి సంపాదించిన పేదల ఆస్తులను ఇప్పుడు అధికార పార్టీ నేతలు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, బడుగు, బలహీన వర్గాల వేధింపులకు రాష్ట్రం వేదికగా మారిందన్నారు. కోవిడ్ సమయంలో మాస్కులు అడిగిన వైద్యుడిని చంపేశారనీ, రాష్ట్ర మద్యం విధానంపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన దళిత యువకుడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారని చంద్రబాబు బహిరంగ లేఖలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న అణగారిన వర్గాల గొంతు నొక్కడమే గన్నవరం హింసాకాండ లక్ష్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు పోలీసు అధికారుల అండదండలతో స్థానిక వైసీపీ నేతలు ఈ నెల 20న విధ్వంసానికి పాల్పడ్డారు. 40 మంది టీడీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించారని, వారిలో కొందరిని పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.

సంకల్ప సిద్ధి కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ఆయన వ్యక్తిగత సహాయకుడు ఓరుపల్లి రంగా గన్నవరం అల్లర్లకు నేతృత్వం వహించగా, వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఈ దాడులకు కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపించారు. త‌న లేఖ‌లో "గన్నవరం దాడులకు స్థానిక ఎమ్మెల్యే వ్యూహరచన చేయగా....ఆయన వ్యక్తిగత సహాయకుడు, సంకల్ప సిద్ది స్కాంలో ప్రధాన నిందితుడు ఓరుపల్లి రంగా దాడుల్లో ముందున్నాడు. ప్రజల నుంచి రూ. 1100 కోట్లు అక్రమంగా వసూలు చేసి వారిని మోసం చేసిన సంకల్ప సిద్ది స్కాంలో ఇతను నిందతుడు. ఈ మొత్తం ఘటనలో దాడులకు గురయ్యింది తెలుగుదేశం కార్యకర్తలు, ధ్వంసం అయింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం, తగలబడిన కార్లు తెలుగుదేశం నేతలవి, బెదిరించి, భయభ్రాంతులను చేసింది తెలుగుదేశం నేతలనే, పోలీస్ టార్చర్ అనుభవించింది తెలుగుదేశం వారే, బాధితులూ తెలుగు దేశం వాళ్లే... కానీ పోలీసులు తప్పుడు ఆరోణలతో చివరకు జైల్లో పెట్టింది తెలుగుదేశం వాళ్లనే" అని పేర్కొన్నారు.

ఇప్పుడు ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య పోరాటం జరుగుతోందనీ, ఈ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలు తనతో కలిసి రావాలని చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు.