Asianet News TeluguAsianet News Telugu

దూకుడు పెంచిన వైకాపా-తగ్గేదేలే అంటున్న టీడీపీ.. జగన్ కొత్త‌ కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు !

Amaravati: వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి 26వ తేదీ వరకు 'జగనన్నే మా భవిష్యతు' ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించాలని 5.6 లక్షల మంది పార్టీ సెక్రటేరియట్ కన్వీనర్లను, గృహ సారధులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. దీంతో ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ క్యాడ‌ర్ ఎన్నిక‌ల మూడ్ లోకి జారుకుంది. ప్రతిపక్ష టీడీపీ సైతం ఇదే తరహా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించింది.

YSRCP cadre in election mood ; Chandrababu is following cm YS Jagan Mohan Reddy's new concept
Author
First Published Feb 20, 2023, 3:00 PM IST | Last Updated Feb 20, 2023, 3:05 PM IST

Andhra Pradesh Assembly election: ఆంధ్ర‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లకు ఇంకా ఏడాదికి పైగా స‌మ‌యముంది. అయితే, రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ‌ పార్టీలు ఇప్ప‌టినుంచే ఎన్నిక‌ల వ్యూహాలు ర‌చిస్తూ ముందుకు సాగుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని అధికార వైఎస్ఆర్సీపీ ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సైతం రానున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అయితే, ప్రస్తుతం ఇంటింటి ప్ర‌చారం కోసం ఇప్ప‌టి నుంచే ఈ రెండు పార్టీలు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకోవ‌డంతో రాష్ట్ర రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఆస‌క్తిక‌రంగా అధికార పార్టీకి చెక్ పెట్ట‌డానికి ఆ పార్టీ అనుస‌రిస్తున్న వ్యూహాల‌ను ప్ర‌తిప‌క్ష పార్టీ కూడా ఫాలో అవుతోంది.

జగనన్నే మా భవిష్యత్తు ప్రచారం.. 

2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైకాపా అధ్యక్షుడు, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన పార్టీ శ్రేణులను క్రియాశీల ఎన్నికల మూడ్ లోకి తీసుకొచ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే సిద్ధం కావాల‌నీ, 'జగనన్నే మా భవిష్యతు' ప్రచారాన్ని ముందుకు తీసుకువ‌చ్చారు. ఇంటింటి ప్ర‌చారం కోసం 50 కుటుంబాలకు 'గృహ సారధి' ద్వారా 'మైక్రో పోల్ మేనేజ్మెంట్' అమలు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అధికార వైకాపా ప్ర‌జ‌ల సంక్షేమం, అమ‌లు చేస్తున్నే ప‌థ‌కాలు, ఇంతకు ముందు ప్ర‌భుత్వాల వైఫ‌ల్యాను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. 

అదే బాట‌లో తెలుగుదేశం..  

ఆస‌క్తిక‌రంగా జ‌గ‌న్ ను అనుస‌రిస్తూ  తెలుగు దేశం పార్టీ సైతం ఇదే త‌ర‌హా వ్యూహాల‌తో అధికార పార్టీకి చెక్ పెట్టాలని చూస్తోంది. టీడీపీ 30 కుటుంబాల చొప్పున సదికార సారధులతో వైకాపా త‌ర‌హా వ్యూహ అమలుకు సిద్ధ‌మైంది. అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రతి ఓటును విలువైనదిగా, కీలకమైనదిగా పరిగణిస్తూ ఓటర్లకు చేరువయ్యేందుకు వైసీపీ, టీడీపీలు ముందుగానే ఎన్నిక‌ల రేసును ప్రారంభించాయి. ఇవి ఒకేసారి జరుగుతాయని భావిస్తున్నప్పటికీ ఏపీలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

ముందుగానే ఎన్నిక‌ల పోరు.. 

భారీ వనరులున్న అధికార వైసీపీ వినూత్న ఆలోచనలతో ఎన్నికల వ్యూహాలను రూపొందించడంలో పైచేయి సాధిస్తోంది. ఈ నెల 18 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా జగనన్న జగనన్నే మా భవిష్యత్తు ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించాలని పార్టీ అధినేతగా 5.6 లక్షల మంది పార్టీ కన్వీనర్లు, గృహ సారధులును ఆదేశించారు. తొలుత దీన్ని ఫిబ్రవరిలో నిర్వహించాలని భావించినప్పటికీ ఇతర షెడ్యూల్ కార్యక్రమాలు, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా మార్చి 18 నుంచి సామూహిక ప్రచారం నిర్వహించాలని జగన్ నిర్ణయించారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు, సమన్వయకర్తలు, రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా యూనిట్ అధ్యక్షులు, గృహ సారధిలు, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు ప్రచార సమయంలో 1.65 కోట్ల ఇళ్లను సందర్శించాలని, ఇంటింటి పర్యటనలు చేయాలని, కుటుంబాలతో గడపాలని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సీఎం కోరారు. గత తెలుగుదేశం పాలనతో పోలిస్తే ప్రభుత్వం పారదర్శక పాలనను అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలా ముందుకు తీసుకెళ్తోందో ప్రజలకు వివరించాలని కోరారు. 5.6 లక్షల మంది గృహ సారధులతో పార్టీ సెక్రటేరియట్ కన్వీనర్లు సమన్వయం చేసుకుంటారని వైసీపీ నేతలు తెలిపారు. 387 మండలాల్లో మొదటి బ్యాచ్ పార్టీ కన్వీనర్లు, గృహ సారధులకు శిక్షణ పూర్తికాగా, రెండో బ్యాచ్ కు శిక్షణ కొనసాగుతోంది.

పార్టీ కన్వీనర్లు, గృహ సారధులును ఉత్తేజపరిచేందుకు ఎమ్మెల్యేలు కూడా శిక్షణా శిబిరాల్లో పాల్గొంటున్నారని వారు తెలిపారు. గృహ సారధిలు కూడా ప్రతి కుటుంబంలో అపరిష్కృత సమస్యలను చూసుకుంటారని, వాటిని అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం ద్వారా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారని నాయకులు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం సామూహిక ప్రచార కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేలతో ప్రస్తావించారని వారు గుర్తు చేశారు. ప్రతి 50 కుటుంబాలకు గృహ సారధిలు ఎప్పుడైనా అందుబాటులో ఉండి తమ సేవలను అందించనున్నారు.

వైకాపా స‌ర్కారు వైఫ‌ల్యాను ఎండ‌గ‌ట్ట‌డం కోసం.. 

చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి ప్రతి 30 కుటుంబాలకు సమిశ్రమ సారధి (సాధికారత అధిపతి) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి, ఎన్నికల్లో వారిని టీడీపీ వైపు ఆకర్షించేందుకు కృషి చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 2,500 నుంచి 3,000 మంది సాధికార సారధిలను ఏర్పాటు చేయాలని, వారిలో 50 శాతం మంది మహిళలే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలకు నిర్దిష్టమైన విధులు ఉంటాయని చంద్రబాబు నాయుడు చెప్పారు.

ప్ర‌తి ఓటు కీల‌క‌మే.. 

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయముంది. దీంతో  వైకాపా పై నుంచి కింది స్థాయి వరకు కార్యకర్తలను యాక్టివ్ పోల్ మోడ్ లో ఉంచింది. టీడీపీ కూడా ఇలాంటి సాధికార లక్ష్యాలను  ప్రకటించడం వైసీపీ మాస్ క్యాంపెయిన్ల మంచి ప్రభావానికి నిదర్శనం. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రధానంగా వైఎస్సార్సీ, టీడీపీలు సారధి కాన్సెప్ట్ కింద ప్రతి ఓటరుతో సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా మైక్రో లెవల్ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాయి. ఇలాంటి విధానాన్ని గతంలో పన్నా ప్రముఖ్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అమలు చేసింది. ఏపీలో తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వైసీపీ, టీడీపీ శ్రేణులు మార్పులు చేసుకుంటున్నాయి. చూడాలి మరి మున్ముందు రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios