Asianet News Telugu

ఆనాడు హోదా వద్దని, ఎన్నికలవేళ కావాలని రాజకీయమా : టీడీపీపై వైసీపీ మండిపాటు

ప్రత్యేక హోదా సంజీవని కాదని, ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ నయం అంటూ ప్రత్యేక హోదాను పక్కనపెట్టిన టీడీపీ ఎన్నికలు సమీపించే సరికి ప్రత్యేక హోదా నెపాన్ని బీజేపీపై నెట్టి  తనకేం తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది. 

ysr congress party slams tdp on special status issue
Author
Amaravathi, First Published Jan 29, 2019, 12:00 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: ప్రత్యేక హోదా అంశాన్ని అన్ని పార్టీలకంటే ముందే భుజాన ఎత్తుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రూట్ మార్చిందా...ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చిన వైసీపీ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ పై ఎందుకు మల్లగుల్లాలు పడుతోంది. 

సీనియర్ రాజకీయ వేత్త మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో జరగబోయే సమావేశానికి ఎందుకు డుమ్మా కొడుతోంది...ప్రత్యేక హోదా అంశంలో వైసీపీ అవలంభించబోతున్న విధానం ఏంటి...ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసిందనడంలో ఎలాటి సందేహం లేదు.

 ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పదవులను సైతం వదులుకున్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేసేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. యువతతో కలిసి వైఎస్ జగన్ యువభేరీ వంటి కార్యక్రమాలతోపాటు వంచనపై గర్జన దీక్షలు చేస్తూ ఎప్పటికప్పుపడు రాజకీయ పార్టీల తీరును ఎండగడుతూ వచ్చారు. 

ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పారబట్టింది. అయితే చివరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఫిబ్రవరి 1న బంద్ కి పిలుపునిచ్చింది. 

అలాగే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో పునర్విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా ఐదేళ్లలో జరిగిన నష్టంపై రాష్ట్ర రాజధానిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించారు. 

ఈ సమావేశానికి వైసీపీ డుమ్మా కొట్టింది. తాము హాజరుకాబోమని స్పష్టం చేసినట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే జనసేన పార్టీ తరుపున ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ తరుపున మంత్రులు నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబంరావులు హాజరుకానున్నారు. 

అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా హాజరుకానున్నాయి. అయితే జగన్ మాత్రం హాజరుకావడం లేదు. అటు ప్రత్యేక హోదా సాధనసమితి కూడా ఆఖరి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చింది. ఆ కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. 

అటు ఈనెల 30న సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని కూడా తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

ఆ సమావేశాలకు సైతం వైసీపీ గైర్హాజరైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈనెల 30న నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశానికి కూడా వైసీపీ హాజరుకాదని ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక హోదా సంజీవని కాదని, ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ నయం అంటూ ప్రత్యేక హోదాను పక్కనపెట్టిన టీడీపీ ఎన్నికలు సమీపించే సరికి ప్రత్యేక హోదా నెపాన్ని బీజేపీపై నెట్టి  తనకేం తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది. 

అధికార తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాపై పట్టుబడి ఉంటే తామంతా అండగా ఉండి కేంద్రంపై పోరాడి సాధించేవాళ్లమని కానీ ఆనాడు ఎన్డీఏలో ఉంటూ పోరాటాలు చేస్తున్న పార్టీలపై ఉక్కుపాదం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది. 

ఇప్పటికీ ప్రత్యేక హోదాపై పోరాడిన వైసీపీ నేతలు, వామపక్ష నేతలపై కేసులు ఉన్నాయని కూడా గుర్తు చేస్తోంది. ఒకప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడిన పార్టీలను దుయ్యబుట్టిన టీడీపీ రాజకీయ ఎత్తుగడలో భాగం ప్రత్యేక హోదా అంశాన్ని భుజానకెత్తుకుందని విమర్శిస్తోంది. 

ఇకపోతే మాజీ ఎంపీ ఉండవల్లి అరున్ కుమార్ నిర్వహించబోయే సమావేశం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కనుసన్నుల్లోనే నడుస్తోందని వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అటు ప్రత్యేక హోదా సాధన సమితి నేతృత్వంలో జరగబోయే బంద్ కు సంబంధించి దాని వెనుక కూడా చంద్రబాబు  ప్లాన్ ఉందని వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 

చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాతే ప్రత్యేక హోదా సాధన సమితి నిరసనకార్యక్రమాలు ప్రకటించిందని వాపోతుంది. తమతో చర్చిస్తే మద్దతు ఇవ్వాలా వద్దా అన్న అంశంపై చర్చించాలని ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు ప్రత్యేక హోదా కోసం వైసీపీ గొంతెత్తితే ఆ గొంతు నొక్కే ప్రయత్నం చేసిన అధికార తెలుగుదేశం పార్టీతో వేదిక పంచుకోబోమని కూడా వైసీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios