హైదరాబాద్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో కీలకమైన మేని ఫెస్టో రూపకల్పనకు రెడీ అవుతుంది. 

నవరత్నా పేరుతో కీలకమైన హామీలతో ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేని ఫెస్టో రూపకల్పనకు సిద్ధమవుతుంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. 

ఈ కమిటీకి వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా 30 మందిని ప్రకటించారు వైఎస్ జగన్. మేని ఫెస్టో కమిటీలో పార్టీ సీనియర్ నేతలతోపాటు పలువురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. 

పార్టీ సీనియర్ నేతలైన బొత్స సత్యనారాయణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలకు స్థానం కల్పించారు. 

అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కొడాలి నాని, రాజన్నదొర, అంజద్ బాషా, పాముల పుష్పశ్రీవాణి, ఆదిమూలపు సురేష్ లకు స్థానం కల్పించారు. వీరితో పాటు తమ్మినేని సీతారాం, సజ్జల రామకృష్ణారెడ్డి, జంగా కృష్ణమూర్తులు సభ్యులుగా వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ కమిటీ రెండు రోజుల్లో సమావేశం కానుంది. సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పనపై కమిటీ చర్చించనుంది.