అనంతపురం: పార్టీకోసం ఆస్తులు అమ్ముకున్న, బంధువులను వదులుకున్నా, పగలు రాత్రి అనక కష్టపడ్డా, కోట్లు ఖర్చుపెట్టి పార్టీని బతికించా అలాంటి తనను తప్పించుకునేందుకు పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హిందూపురం వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ నవీన్ నిశ్చల్ బోరున విలపించారు. 

2014 ఎన్నికల్లో హిందూపురం నియోకవర్గంలో సినీనటుడు బాలకృష్ణపై వైసీపీ అభ్యర్థిగా నవీన్ నిశ్చల్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించకపోతే అరగుండు కొట్టించుకుంటా అంటూ సవాల్ విసిరిన ఆయనకు పార్టీలో పొమ్మనలేక పొగబెడుతున్నారని వాపోయారు. 

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తన ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధపడ్డ వ్యక్తినని అలాంటిది తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయంటూ హిందూపురం వైసీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ కన్నీరుమున్నీరయ్యారు. 

పార్టీ కోసం తాను అహర్నిశలు శ్రమిస్తున్నానని అయితే తనను ఎదుర్కొనేందుకు చేతకాక తాను నమ్ముకున్న వాళ్లే నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారని దాన్ని తట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు. పార్టీలో జరగుతున్న పరిణామాల నేపథ్యంలో తాను బాధపడుతుంటే తన భార్య చూసి కంటతడిపెట్టుకున్న విషయాన్ని కార్యకర్తలతో చెప్పి బోరున విలపించారు. 

పెళ్లైన నాటి నుంచి తన భార్య ఇప్పటి వరకు ఎలాంటి మాట అనలేదని అయితే ఇటీవల జరుగుతున్న పరిస్థితులను గమనించి నువ్వు బాధపడుతూ మమ్మల్ని ఎందుకు బాధపెడతావంటూ ఆమె రోదించిన తీరును పంచుకున్నారు. 

తాను తన సొంత తమ్ముడి దగ్గర కానీ రక్త బంధువుల దగ్గర కానీ ఏడవలేదని అయితే తనకు అన్నదమ్ముల కంటే ఎక్కువైన మీ కార్యకర్తల దగ్గరమాత్రమే కన్నీరు కార్చానని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో తనను ఎదుర్కొవడం చేతకాక తాను ప్రాణంకంటే ఎక్కువగా నమ్మే వ్యక్తిని అడ్డం పెట్టుకుని నన్ను తప్పించేందుకు నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

పార్టీలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తాను కలలో కూడా ఊహించలేదని వాపోయారు. ఇటీవలే హైదరాబాద్ లో ఉంటున్న తన తమ్ముడు మురళీనాయుడు వద్దకు వెళ్లాలనని ఆయన కూడా పార్టీలో జరుగుతున్న పరిస్థితులపై ఆరా తీశాడని చెప్పుకొచ్చారు. 

అయితే తన సోదరుడితో తాను చేతనైనంత వరకు చేతనైనది చేస్తానని చెప్పానని తెలిపారు. తన బాధను చూసిన సోదరుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులే కదా అడుగుతున్నాడు ఐదు కోట్లో ఎంతో కొంత ఇస్తాను లే అని హామీ కూడా ఇచ్చారని తెలిపారు. తన సోదరుడు రూ.5కోట్లు సర్దుతానన్నాడని చెప్పానని అయినా జగన్ వినడం లేదని బాధపడ్డారు. 
 
వైసీపీ అభివృద్ధి కోసం అహర్నిశలూ కృషిచేశానని జిల్లాలో ఎక్కడా లేని విధంగా హిందూపురం నియోజకవర్గంలో అధికార పక్షంపై పోరాడానని చెప్పుకొచ్చారు. అలాంటి నాపైనే కుట్రలు చేస్తూ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు పోటీచేసి విజయానికి చేరువగా వచ్చానని  2019లో ఎన్నికల్లో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ కార్యకర్తల సాక్షిగా నవీన్‌నిశ్చల్‌ కన్నీటి పర్యంతమయ్యారు. 

ఇకపోతే నవీన్ నిశ్చల్ ఎందుకు ఏడ్చారన్న విషయానికి వస్తే వైసీపీలో అతనికి చెక్ పెట్టడమే కారణమని ఆయనే చెప్తున్నారు. హిందూపురంలో మైనార్టీ వర్గానికి చెందిన ఓ నేత, మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి వస్తున్నారంటూ కొద్ది రోజులుగా హిందూపురంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 
 
ఈ నేపథ్యంలో మైనార్టీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు, ఆ పార్టీ ముఖ్య నాయకులతో బుధవారం నవీన్‌నిశ్చల్‌ తన నివాసంలో అంతర్గత సమావేశం నిర్వహించారు. తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాజీలేని పొరాటం చేస్తున్నానంటూనే తనపై జరుగుతున్న కుట్రలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పదవులు ఇవ్వవచ్చునన్నారు. ఇప్పటివరకు మైనార్టీలతో అన్నదమ్ముల్లా ఉన్నామని, అయితే మనలో మనకే విభేదాలు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. 
 
కంటతడిపెట్టిన నవీన్ నిశ్చల్ ను మైనార్టీ నాయకులు, పార్టీ నాయకులు ఓదార్చారు. తమ ప్రాణాలైనా అడ్డం పెట్టి గెలిపించుకుంటామంటూ నవీన్‌ నిశ్చల్‌కు భరోసా ఇచ్చారు. నవీన్ నిశ్చల్ కంటతడిపెట్టడం, జగన్ అడుగుతుంది 5కోట్ల రూపాయలే కదా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.