కడప: హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి రాసినట్లు చెబుతున్న ఓ లేఖ తీవ్రమైన దుమారం రేపుతోంది. కారు డ్రైవర్ ప్రసాద్ తనను చచ్చిపోయేట్లు కొట్టాడని వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఆయన బంధువులు శుక్రవారం సాయంత్రం పోలీసులకు అందించారు. 

"నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటరు రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవరు ప్రసాద్‌ను వదలి పెట్టవద్దు. ఇట్లు వివేకానందరెడ్డి" అని ఆ లేఖలో ఉంది. ఈ లెటరు అందుకున్న పోలీసులు కారు డ్రైవరు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

పులివెందులకు చెందిన ప్రసాద్‌ ఒకటిన్నర నెలగా వైఎస్ వివేకా వద్ద కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 11.30కు ఇంటి వద్ద వదలిన ప్రసాద్‌ తిరిగి ఎప్పుడొచ్చాడనేది తెలియదు. జగన్‌ చెప్పినట్లు గొడ్డలితో దారుణంగా నరకడంతో తీవ్రంగా గాయపడిన వివేకా ఆ లేఖ రాసే పరిస్థితిలో ఉన్నాడా అనేది అనుమానమే.

ఆ లేఖపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ స్పందించారు. గొడ్డలితో నరికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతన్న వ్యక్తి ఎలా ఈ లేఖ రాయగలుగుతారని ప్రశ్నించారు. కారు డ్రైవరు ప్రసాద్‌ను, రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు ఆర్‌.సుధాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లేఖను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. వివేకానే ఆ లేఖ రాశాడా లేదా అనే తెలుసుకోనున్నారు.

గురువారం రాత్రి 11.30గంటలకు కారు డ్రైవరు ప్రసాద్‌ వివేకాను ఆయన నివాసంలో వదలి వెళ్లిపోతుండగా భోజనానికి వివేకా డబ్బులిచ్చాడని, తాను ఇంట్లోనే భోజనం చేస్తానని డ్రైవర్ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. వివేకా హత్య వెనుక ఎవరున్నారు, ఎందుకు జరిగింది, ఏవైనా ఆర్థిక లావాదేవీలా, కుటుంబ కలహాలా, లేదా ఫ్యాక్షనిస్టుల వ్యవహారమా అనే చర్చ సాగుతోంది.