వైఎస్ వివేకా హత్య కేసు: ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
హైదరాబాద్:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ 6 నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ మంగళవారంనాడు కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 11వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
సీబీఐ హైకోర్టులో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను ఇవాళ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం మూడు గంటలకు కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసు సీడీ ఫైల్ ఇవ్వాలని సీబీఐని న్యాయమూర్తి అడిగారు. అయితే ఈ ఫైల్ ఢిల్లీలో ఉందని న్యాయమూర్తికి సీబీఐ అధికారులు తెలిపారు. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
ఈ ఏడాది ఏప్రిల్ 14న ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి ఏ 6 నిందితుడు. వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహనికి బ్యాండేజీ చేయించడంలో ఉదయ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది.
also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి
ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి పులివెందులలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రిని పిలిపించి బ్యాండేజీ వేయించారు. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను సీబీఐ ప్రస్తావించింది.