వైఎస్ వివేకానంద రెడ్డి వాచ్‌మెన్ రంగన్న అస్వస్థతకు గురయ్యారు. శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన మంగళవారం పులివెందుల ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వాచ్‌మెన్ రంగన్న అస్వస్థతకు గురయ్యారు. శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన మంగళవారం పులివెందుల ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం ఆయనను తిరుపతికి తరలించారు. వివేకా కేసులో రంగన్న కీలక సాక్షిగా వున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో వివేకా పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. దాదాపు మూడు గంటల పాటు ఆయనను విచారించారు. 

కాగా.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. భాస్కర్ రెడ్డికి మే 10వ తేదీ వరకు జ్యూడిషయల్ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. దీంతో భాస్కర్ రెడ్డిని అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

ఇక, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి సన్నిహితుడు. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ నెల 14న ఉదయ్ కుమార్‌ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ నెల 16న అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వైఎస్ భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిలను ఏప్రిల్ 19 నుంచి 24 వరకు ఆరు రోజుల పాటు విచారించేందుకు తెలంగాణ హైకోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను విచారించారు. 

ALso Read: వైఎస్‌ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా :అందరి చూపు సీబీఐ వైపే

నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో వారి ఆరోపించిన పాత్ర గురించి సీబీఐ అధికారులు వారిద్దరినీ ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో రూ. 40 కోట్ల డీల్, నిందితులలో ఒకరైన సునీల్ యాదవ్‌కు రూ. 1 కోటి చెల్లింపు అంశంలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను దర్యాప్తు సంస్థ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి కూడా కోర్టు మే 10 వరకు జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే.