హైదరాబాద్‌: మాజీమంత్రి తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంపై సోషల్‌ మీడియాలో అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆరోపించారు. 

అసత్యప్రచారాలను చూసి తమ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతుందని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్యకథనాలపై చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు ఆమె ఫిర్యాదు చేశారు. 

తన తండ్రిని చులకన చేసే కుట్రతో ఈ అసత్య ప్రచారం కొనసాగిస్తున్నారంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సజ్జనార్‌ను కోరినట్లు సునీత తెలిపారు. 

ఇకపోతే ఇటీవలే వైఎస్‌ వివేకా హత్య కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలంటూ సునీత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. తన తండ్రి హత్యపై థర్డ్ పార్టీ విచారణ కోరారు వైఎస్ సునీత.