Asianet News TeluguAsianet News Telugu

అవినాశ్‌ ముందస్తు బెయిల్ రద్దుపై సునీత పిటిషన్‌.. రేపు సుప్రీంలో విచారణ..!!

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ రేపు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.

YS Viveka Murder Case SC to hear Sunitha plea seeking cancellation of MP Avinash Reddy bail ksm
Author
First Published Jun 8, 2023, 12:55 PM IST

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ రేపు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఇక, సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను ఆమె సునీత తరపు సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూధ్రా నేడు ప్రస్తావించారు. కేసు డైరీ వివరాలను అందజేశారు. ఈ క్రమంలోనే సునీత పిటిషన్‌ను రేపు మెన్షన్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. రేపటి మెన్షన్ జాబితాలో చేర్చాలని రిజస్ట్రీని సుప్రీం కోర్టు ఆదేశించింది. 

వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత తన పిటిషన్‌లో కోరారు. సీబీఐ పేర్కొన్నట్లుగా కేసులో అవినాష్ రెడ్డిది కీలకమైన ప్రమేయం ఉందని ఆరోపించారు. అవినాష్ రెడ్డిపై సీబీఐ సమర్పించిన ఛార్జిషీట్లు, అఫిడవిట్లన్నీ తీవ్ర స్వభావాన్ని కలిగి ఉన్నాయని.. అయితే వాటిని తెలంగాణ కోర్టు పట్టించుకోలేదని అన్నారు. వివేకా హత్య కేసు విచారణను జూన్ 30లోగా ముగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన నేపథ్యంలో విచారణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతున్నట్టుగా చెప్పారు. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను సీబీఐ సైతం వ్యతిరేకిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

అయితే వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే గత నెలలో విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా.. పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టి.. గత నెల 31న ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

ఈ సందర్భంగా  పలు షరతులు కూడా విధించింది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసినట్లయితే రూ. 5లక్షల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ అనుమతి లేకుండా అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది. జూన్‌ నెలాఖరు వరకు ప్రతి శనివారం ఉ. 10 నుంచి సా. 5గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని అవినాష్‌ను ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios