Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్య కేసు.. ముందస్తు బెయిల్ కోసం మరోసారి సుప్రీంను ఆశ్రయించిన అవినాష్ రెడ్డి..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్.. ముందస్తు బెయిల్ కోసం మరోసారి సుప్రీం తలపు తట్టారు.

YS Viveka murder case MP YS Avinash Reddy once again Approach supreme court seeking anticipatory bail ksm
Author
First Published May 22, 2023, 11:43 AM IST

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్.. ముందస్తు బెయిల్ కోసం మరోసారి సుప్రీం తలపు తట్టారు. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన అవినాష్.. అందుకు సంబంధించి వెకేషన్ బెంచ్ విచారించాలని కోరారు. ముందుగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన తరఫు లాయర్లు జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ నరసింహలతో కూడి ద్విసభ్య ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. అయితే పిటిషన్ తమ ముందు విచారణకు రావట్లేదని ధర్మాసనం పేర్కొంది. మరో వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సూచించింది. 

ఈ క్రమంలోనే జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ముందు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన తరఫు లాయర్లు మెన్షన్ చేశారు. అయితే మెన్షనింగ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించాలని జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం సూచించింది. అయితే సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయనున్నారనే ప్రచారం నేపథ్యంలో.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అయితే మే 16, మే 19వ తేదీల్లో రెండు విచారణ తేదీలను అవినాష్ రెడ్డి దాటవేశారు.తాజా ఈరోజు(మే 22) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ప్రస్తుతం తన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున్న విచారణకు హాజరయ్యేందుకు 5 రోజుల సమయం కావాలని  కోరారు. ఇక, ఈ నెల 19 నుంచి అవినాష్ రెడ్డి తన తల్లి లక్ష్మమ్మ చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రిలో ఉండిపోయారు.

అయితే ఈరోజు ఉదయం సీబీఐ అధికారులే నేరుగా కర్నూలుకు చేరుకోవడంతో ఏ విధమైన పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్రిక్తత నెలకొంది. కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో చర్చలు జరుపుతున్నారు. శాంతి భద్రతలకు సంబంధించి సీబీఐ అధికారులు ఎస్పీతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అధికారం ఉందని సీబీఐ అధికారులు చెప్పినట్టుగా సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios