వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం తాను దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని.. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్‌ను విచారించేలా ఆదేశించాలని కోరారు. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోరినట్టుగా తెలుస్తోంది. 

అయితే ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు అవినాష్ రెడ్డి తరపు లాయర్లు ఈరోజు మెన్షన్ చేశారు. అయితే ఇందుకు సంబంధించి విచారణ తేదీని సీజేఐ ధర్మాసనం ఖరారు చేయలేదు. విచారణ అత్యవసరమైతే రాతపూర్వక అభ్యర్థన ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. దానిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సూచించింది. 

ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారించారు. తాజాగా దాదాపు 20 రోజుల విరామం తర్వాత సోమవారం అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రాంతీయ కార్యాలయంలో తమ ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులకు లేఖ రాసిన అవినాష్ రెడ్డి.. తన సొంత జిల్లాలో పార్టీ పరమైన కార్యకలాపాలు ముందుగా నిర్ణయించుకున్నందున నాలుగు రోజుల తర్వాత విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. అనంతరం హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లిపోయారు. 

మరోవైపు అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై త్వరగా విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.