Asianet News TeluguAsianet News Telugu

కర్నూలులోనే సీబీఐ అధికారులు.. విశ్వభారతి ఆస్పత్రి వద్ద భారీగా వైసీపీ శ్రేణులు.. కొనసాగుతున్న హైడ్రామా..!!

కర్నూలు నగరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో విశ్వభారతి ఆస్పత్రి వద్దకు వైసీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

ys viveka murder case cbi officials in kurnool dramatic events at vishwa bharati hospital ksm
Author
First Published May 22, 2023, 4:53 PM IST

కర్నూలు: కర్నూలు నగరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోమారు విచారణకు సమయంలో కోరడంతో.. సీబీఐ అధికారులు ఈరోజు తెల్లవారుజామున కర్నూలు చేరుకున్నారు. అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండంతో.. ఆయన గత నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే.  

ఈ క్రమంలోనే కర్నూలు ఎస్పీ బంగ్లాకు చేరుకున్న సీబీఐ అధికారులు.. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో చర్చలు జరిపారు. అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అధికారం ఉందని చెప్పిన సీబీఐ అధికారులు..  శాంతి భద్రతలకు సంబంధించి ఎస్పీతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. అలాగే అవినాష్‌ అరెస్ట్‌కు సహకరించాలని కోరిన ట్టుగా సమాచారం. అయితే ఎస్పీ కృష్ణకాంత్ సీబీఐ విజ్ఞప్తిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. డీజీపీ ఆదేశాలు ఇస్తేనే నిర్ణయం తీసుకుంటామని సీబీఐకి ఎస్పీ చెప్పినట్లు సమాచారం. 

అయితే ప్రస్తుతం కర్నూలు పోలీసు గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులు ఉన్నారు. అయితే కర్నూలు పోలీసులు లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితిని అదుపు చేయడంపై నిస్సహాయత వ్యక్తం చేసిన  నేపథ్యంలో.. ఇక్కడి పరిణామాలను న్యూఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారులకు చేరవేశారు. ఈ క్రమంలోనే సీఆర్‌పీఎఫ్ ఐజీతో సీబీఐ అధికారులు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నుంచి సీఆర్ఎఫ్‌ఐ బలగాలు కర్నూలుకు బయలుదేరినట్టుగా పలు మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. అయితే దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో విశ్వభారతి ఆస్పత్రి వద్దకు వైసీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే కర్నూలులోని ప్రధాన కూడళ్లతో పాటు.. విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లే అన్ని దారులలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తవారిని ఎవరినీ కూడా ఆస్పత్రి వైపుకు అనుమతించడం లేదు. ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్న వైసీపీ కార్యకర్తలను కూడా తిప్పి పంపుతున్నారు. 

అయినప్పటికీ విశ్వభారతి ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న వైసీపీ శ్రేణులు అక్కడే బైఠాయించారు. సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సీబీఐ అధికారులు తమ నాయకుడి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపించారు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా విశ్వభారతి ఆస్పత్రి వద్దే ఉన్నారు. ఇక, అక్కడికి చేరుకున్న వైసీపీ శ్రేణులకు స్థానిక వైసీపీ నాయకులు భోజన ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో కర్నూలులో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. 

ఇక, వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఈ లేఖలో ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలిపారు. సుప్రీం కోర్టులో తన పిటిషన్‌పై రేపు విచారణ ఉందని పేర్కొన్నారు. తన తల్లి శ్రీలక్ష్మి దృష్ట్యా ఈ నెల 27 వరకు విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. 27 తర్వాత విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పారు. సుప్రీం కోర్టులో తన పటిషన్ విచారణలో ఉన్నందున తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios