Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య కేసు: నిన్‌హైడ్రిన్‌ టెస్టు అంటే ఏమిటి?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ వివేకానందరెడ్డి మరణించడానికి ముందు రాసినట్టుగా చెబుతున్న లేఖపై నిన్‌హైడ్రిన్‌ పరీక్ష చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది.

YS Viveka Murder Case CBI Court allows to ninhydrin test for alleged last letter how does it works ksm
Author
First Published Jun 8, 2023, 9:52 AM IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ వివేకానందరెడ్డి మరణించడానికి ముందు రాసినట్టుగా చెబుతున్న లేఖపై నిన్‌హైడ్రిన్‌ పరీక్ష చేసేందుకు సీబీఐ కోర్టు ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి సీహెచ్‌ రమేష్‌బాబు బుధవారం అనుమతించారు. వివేకా రాసినట్టుగా చెబుతున్న లేఖపై  నిన్‌హైడ్రిన్‌ పరీక్ష చేయించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ గతంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో లేఖపై ఇంక్ చెరిగిపోయే అవకాశం ఉన్నందున.. అసలు లేఖ పాడైనట్లయితే, విచారణలో ఆ కాపీని సాక్ష్యంగా ఉపయోగించడానికి అనుమతించాలని కోర్టును సీబీఐ అభ్యర్థించింది. 

ఇందుకు తాజాగా సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో.. ఆ లేఖను నిన్‌హైడ్రిన్ పరీక్ష నిమిత్తం ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపనున్నారు. ఇక, నిన్‌హైడ్రిన్ పరీక్షలో అసలు లేఖ దెబ్బతిన్న, అందులోని రాత చెరిగిపోయినా.. ప్రత్యామ్నాయ సాక్ష్యం నిమిత్తం సర్టిఫైడ్ కాపీలను సిద్దం చేయాల్సి ఉందని.. ఇందుకు వీలుగా అసలు లేఖను కోర్టు ముందు ఉంచాలని సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు. 

దీంతో ఇప్పుడు నిన్‌హైడ్రిన్ పరీక్ష అంటే ఏమిటనేది ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారింది. అయితే ఫోరెన్సిక్‌ పరిశీలనలో నిన్‌హైడ్రిన్‌ టెస్ట్‌ అన్నది చాలా కీలకం అని నిపుణులు చెబుతున్నారు. నిన్ హైడ్రిన్ పరీక్ష అనేది అమ్మోనియా, ప్రైమరీ/సెకండరీ అమైన్‌లు లేదా అమైనో ఆమ్లాలను గుర్తించడానికి ఉపయోగపడే ఒక రసాయన పరీక్ష. దాని ఫార్ములా C9 H6 O4. దీన్ని ఇథనాల్‌లో వేసినప్పుడు కరిగిపోతుంది. నిన్‌హ్రైడిన్‌ పౌడర్‌ను రసాయనిక ద్రావణంగా మార్చి లేఖపై స్ప్రే చేస్తారు. లేదా ఆ రసాయనంలో లేఖను ముంచి బయటకు తీస్తారు. ఆ తర్వాత 80 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలో దాన్ని వేడిచేస్తారు. తర్వాత బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు తీసుకొస్తారు. పది నిమిషాల తర్వాత ఆ లేఖపై ఎక్కడెక్కడ వేలి ముద్రలు ఉన్నాయో ఆ ప్రాంతం నీలం ఉదారంగు(వంగపండు కలర్‌)లోకి మారుతుంది. అప్పుడు వేలిముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో ఆ లేఖపై ఉన్న వేలిముద్రలు ఎవరివనేది తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 

అయితే వివేకా హత్య జరిగిన స్థలంలో లభించిన ఈ లేఖను పీఏ కృష్ణారెడ్డితో పాటు, పలువురు కుటుంబ సభ్యులు ముట్టుకున్నారు. ఆ తర్వాతనే లేఖ పోలీసుల  వద్దకు చేరింది. ఇదిలా ఉంటే, గతేడాది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఈ లేఖను పరిశీలించి.. బలవంతంగా లేఖ రాయించారని నివేదించింది. అయితే హత్య జరిగిన తర్వాత నాలుగేళ్ల తర్వాత సీబీఐ నిన్‌హైడ్రిన్ పరీక్షలకు సిద్దం అవడంతో.. వివేకా చేత బలవంతంగా లేఖ రాయించిన వ్యక్తుల వేలిముద్రలు  గుర్తించడం సాధ్యమవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే లేఖపై రక్తపు మరకలు, అక్షరాలపై పడిన వేలిముద్రలను ఈ పరీక్ష ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి నిన్‌హైడ్రిన్ పరీక్షల ద్వారా వివేకా హత్య కేసులో ఎలాంటి పురోగతి  లభిస్తుందో వేచి చూడాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios