కడప: చాలా కాలం తెర వెనకే ఉండిపోయిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికే ఆయన తిరిగి క్రియాశీలకంగా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్లమెంటుకు పోటీ చేస్తారా, అసెంబ్లీకి పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. 

పారిశ్రామిక విప్లవం రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని  వైఎస్‌ వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రాయచోటిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా అనేక ఉద్యమాలతో ప్రత్యేక​ హోదా అంశాన్ని సజీవంగా ఉంచామని ఆయన చెప్పారు. 

చివరి అస్త్రంగా తమ పార్టీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించామని ఆయన గుర్తు చేశారు. విభజన హమీలతో పాటు నదుల అనుసంధానమైన దొమ్మగూడెం, బ్రహ్మం సాగర్, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వేలిగోండ వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకోరావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీ ప్రత్యేక హోదా కోసం తెలంగాణ ఎంపీలు సహకరిస్తామని అంటున్నారని, మొత్తం 42 ఎంపీలతో కలిసి పోరాడితేనే తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని తెలిసినా.. టీడీపీ, కాంగ్రెస్‌లు ఏనాడు అడిగింది లేదని, బీజేపీ ఇచ్చిందీ లేదని ఆయన అన్నారు. 

సరిగ్గా ఎన్నికల ముందు హోదా కావాలంటూ ప్రజాస్వామ్యాన్ని పునరుధ్ధరిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్ వివేకా విమర్శించారు.