తిరుపతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తిరుమల వెళ్లనున్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

అనంతరం మరుసటి రోజు వైయస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా అయిన కడపలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి నేరుగా పులివెందులకు వెళ్తారు. 

అక్కడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపుల పాయ చేరుకుని తన తండ్రి, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పింస్తారు. అనంతరం సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. 

ఆ తర్వాత గండి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కడప పెద్ద దర్గాను దర్శించి ఆశీర్వాదం తీసుకోనున్నారు వైయస్ జగన్. అక్కడ నుంచి తిరుమల చేరుకుంటారు. మంగళవారం రాత్రికి తిరుమలలోనే బస చేసి బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు వైయస్ జగన్.