ఈ నెల 9న వైసీపీ విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న 8 వేల మంది.. దిశానిర్దేశం చేయనున్న జగన్..
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 9వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 9వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.అక్టోబర్ 9వ తేదీన ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్, రీజినల్ కో ఆర్డినేటర్లు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం,మండల స్థాయి ముఖ్య నాయకులతో కలిసి 8,000 మంది హాజరుకానున్నారు.
ఈ సందర్బంగా రానున్న ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వై ఏపీ నీడ్స్ జగన్..అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింతగా వివరించేలా జగన్ సూచనలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం జగన్ మాట్లాడే అవకాశం ఉంది. అదే సమయంలో టీడీపీ, జనసేన విమర్శలను బలంగా తిప్పికొట్టడంపై కూడా వైసీపీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే టీడీపీ-జనసేన పొత్తు ఖరారు కావడంతో.. రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు పోటీగా ప్రజల్లోకి వెళ్లేలా వైసీపీ శ్రేణులకు జగన్ మార్గనిర్దేశం చేయనున్నారు.