ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు కూడా హాజరుకానున్నారు. వైసీపీ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష చేపట్టనున్నారు. ఇక, ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్.. 2022 మేలో ప్రారంభించగా.. ఇప్పటివరకు నాలుగు సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు సంబంధించి గతంలో నిర్వహించిన సమీక్ష సమావేశాల సందర్భంగా సీఎం జగన్ పలువురు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో యాక్టివ్‌గా లేరని.. గ్రామాల్లో పర్యటించలేదని సీఎం జగన్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. అలాగే గృహ సారథులకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం జగన్ కేబినెట్‌లో మార్పులు-చేర్పులు చేయనున్నారనే ప్రచారం నేపథ్యంలో.. ఈ సమావేశంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కొందరు మంత్రులకు కూడా సీఎం జగన్ వార్నింగ్ ఇవ్వనున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు కోల్పోవడంతో.. ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆందోళన వారిలో నెలకొన్నట్టుగా సమాచారం. 

అయితే వైసీపీ నేతలు మాత్రం మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు- చేర్పులు ఉండవని.. గడప గడపకు మన ప్రభుత్వంపై గతంలో జరిగిన మాదిరిగానే సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారని చెబుతున్నారు.