విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను చేరినప్పుడు నాకు తమ్ముడు కంటే ఎక్కువ అని వైఎస్ జగన్ చెప్పారని రాధా చెప్పుకొచ్చారు. 

తమ్ముడు అంటూనే తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. తాను వైసీపీలో చేరేటప్పుడు తన తండ్రి ఆశయాలను జగన్ కి వివరించినట్లు తెలిపారు. విజయవాడలో వేలాది మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలన్నదే తన తండ్రి లక్ష్యమని అదే తన లక్ష్యమని చెప్పానని స్పష్టం చేశారు. 

కానీ అడుగడుగునా ఆంక్షలు విధించారని చెప్పుకొచ్చారు. తన తండ్రి వంగవీటి మోహనరంగా ఒక వ్యక్తి కాదని వ్యవస్థ అని స్పష్టం చేశారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విగ్రహావిష్కరణకు వెళ్తే ఎవరికి చెప్పి వెళ్లావంటూ జగన్ నిలదీశారని చెప్పుకొచ్చారు.  

వైసీపీలో ఎన్నో అవమానాలకు గురి చేశారని అయినా భరించానని చెప్పుకొచ్చారు. పార్టీలో చేరేటప్పుడు తమ్ముడిలా చూసుకుంటానని చెప్పి జగన్‌ మోసం చేశారన్నారు. నీ తండ్రి మీద జాలిచూపించి పార్టీలో ఉండనిచ్చా అని పదేపదే అంటుంటే బాధ అనిపించిందన్నారు. 

నేను వదిలిస్తే గాలికి పోతావని అని కూడా పదేపదే సూటిపోటి మాటలు అనడంతో భరించలేకపోయానన్నారు. పార్టీ సీటివ్వనందుకు బయటకు రావలేదని తనను అన్నమాటలకు బయటకు వచ్చేశానని స్పష్టం చేశారు. 

తమ్ముడు అన్న వైఎస్ జగన్ రాజీనామా చేసిన తర్వాత ఒక్కఫోనైనా చేశావా అంటూ నిలదీశారు. అంత పనికిరానివాడినైపోయానా అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్‌రెడ్డి పద్దతి మార్చుకొవాలని హితవు పలికారు. రంగా అభిమానులను గౌరవించాలని, తనకు జరిగిన అవమానాలు మరొకరికి జరగకూడదని సూచించారు. 

తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదని రాధాకృష్ణ స్పష్టం చేశారు. అన్ని పార్టీల నేతలు తన తండ్రిని గౌరవిస్తారని చెప్పుకొచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చంపేస్తామంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరించారని రాధా తెలిపారు. 

తన ప్రాణం కంటే తన తండ్రి ఆశయ సాధనే ముఖ్యమన్నారు. తాను జగన్ తో కలిసి పనిచెయ్యాలని భావించానని అయితే ఆయన మాత్రం నా కింద పనిచెయ్యాలన్నట్లు ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యలమంచిలి రవిని పార్టీలోకి తీసుకురావాలని కోరితే తానే తీసుకువచ్చానని అక్కడ నుంచి పోటీ చెయ్యాలని చెప్తే ఎలా అంటూ ప్రశ్నించారు. 

అక్కడ నుంచి పోటీ చెయ్యి ఇక్కడ నుంచి పోటీ చెయ్యి అంటూ అటూ ఇటూ తిప్పారని మండిపడ్డారు. పలువురు పార్టీ నేతలు వచ్చి తనతో చర్చలు జరపడం స్టేట్మెంట్లు ఇవ్వడం అవన్నీ అలాగే భరిస్తూ వచ్చానన్నారు. నాలుగున్నరేళ్లు తన క్యారెక్టర్ చంపుకుంటూ భరించానని ఆవేదన వ్యక్తం చేశారు. 

జగన్ నేతృత్వంలో పలు సందర్భాల్లో ముఖ్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం చేసినప్పుడు కూడా జగన్ పట్టించుకోలేదన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద విగ్రహం పెట్టిద్దామంటూ చెప్పడంతో తాము అన్నీ మూసుకోవాల్సి వచ్చిందన్నారు. 

ఎమ్మెల్యే పదవిని సైతం చులకనగా చూసే వ్యక్తి దగ్గర తాను ఉండాలా అంటూ ప్రశ్నించారు. వైసీపీలో ఉంటే తాను స్వేచ్ఛగా ఏమీ చెయ్యలేనని తెలుసుకున్నానని చెప్పారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకే తాను బయటకు వచ్చినట్లు తెలిపారు వంగవీటి రాధా.