కేబినెట్ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో బీసీలకు పెద్ద పీట వేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అగ్రస్థానం దక్కిన దాఖలాలు లేవు. దీనిపై పలువురు సామాజిక వేత్తలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
రాజ్యాధికారంలో చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఆయా వర్గాలకు కేబినెట్‌లో పెద్దపీట వేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) . పాత ,కొత్త మేలు కలయికతో మంత్రివర్గాన్ని రూపొందించారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్‌లో సామాజిక విప్లవం జరిగితే.. ఇప్పుడు పునర్ వ్యవస్థీకరణ (ap cabinet reshuffle) ద్వారా మరో సామాజిక మహా విప్లవానికి జగన్ తెరదీశారు. చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అగ్రస్థానం దక్కిన దాఖలాలు లేవు.
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2019 జూన్‌లో మొదటి కేబినెట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో 25 మందికి గానూ 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రి పదవులు కేటాయిస్తే.. కేవలం 11 మంది ఓసీలకు మంత్రి పదవులు ఇచ్చారు జగన్. చరిత్రలో ఎప్పుడూ ఇన్ని మంత్రిపదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన దాఖలాలు లేవు.
2014లో చంద్రబాబు 25కి 12 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మాత్రమే మంత్రి పదవులు కేటాయించారు. ఇందులో ఎస్సీలకు ఇచ్చింది 3 మాత్రమే. చంద్రబాబు (chandrababu naidu) తొలి కేబినెట్లో ఎస్టీ, మైనార్టీలకు అసలు చోటు దక్కలేదు. చంద్రబాబు దిగిపోయే 4 నెలల ముందు మాత్రమే ఎస్టీకి పదవి కేటాయించారు. 2019 తొలి కేబినెట్లోనే జగన్ 5 మందికి డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. ఇందులో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. చరిత్రలో ఇప్పుడూ కూడా ఇన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు ఈ వర్గాలకు ఇవ్వలేదు.
అలాగే దేశ సామాజిక న్యాయచరిత్రలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేటెడ్ వర్కుల్లో 50 శాతం ఇచ్చిన తొలి ప్రభుత్వం వైయస్సార్‌సీపీదే. అందులోనూ యాభై శాతం మహిళలకు కేటాయించిన తొలి ప్రభుత్వం కూడా వైయస్.జగన్ ప్రభుత్వానిదే . అటు ఏఎంసీలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, గుడి ఛైర్మన్‌లలోనూ సామాజిక న్యాయం చేశారు జగన్. ఒక చట్టం చేసి మరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇచ్చిన ప్రభుత్వం వైయస్.జగన్‌దే. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల పదవులను కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చింది జగన్ సర్కార్.
ఇప్పుడు తాజా పునర్వ్యస్ధీకరణ ద్వారా తన విప్లవాత్మక నిర్ణయాలను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు వైయస్.జగన్. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ద్వారా మంత్రిమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 17 మందికి చోటు కల్పించారు. మొత్తంగా 25 మందిలో ఈ వర్గాలకు చెందిన 17 మందికి పదవులు కట్టబెట్టారు జగన్. ఇందులో బీసీలు ప్లస్ మైనార్టీలకు 11, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1 చొప్పున కేటాయించారు. అంటే మంత్రిమండలిలో 68 శాతం బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు ఇచ్చారు వైయస్.జగన్. 25 మంది కొత్త మంత్రులలో ఓసీలు 8 మందే. 2019 నాటి జగన్ తొలి కేబినెట్లో మహిళలకు 3 పదవులు కేటాయిస్తే.. ఇప్పుడు వాటి సంఖ్య నాలుగుకు చేరింది.
2017లో చంద్రబాబు చేసిన మంత్రివర్గ విస్తరణను చూస్తే ఓసీలు 13, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు 12 చొప్పున పదవులు కేటాయించారు. అంటే చంద్రబాబు హయాంలో ఉన్న.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల మంత్రి పదవుల సంఖ్యను 12 నుంచి 17కు పెంచారు జగన్. అంటే దాదాపు అప్పటికంటే.. 50 శాతం పెరుగుదల. ఇదికాక గత మంత్రివర్గంలో 10 మందిని కొనసాగిస్తున్న జగన్. ఇందులో ఓసీలు, 2, ఎస్సీలు 3, బీసీలు 5 మంది వున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవిని వైశ్యులకు ఇవ్వాలని నిర్ణయించి.. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి (kolagatla veerabhadra swamy) కట్టబెట్టారు. ప్లానింగ్ బోర్డు డిప్యూటీ ఛైర్మన్ పదవిని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు (malladi vishnu) , శాసనసభలో చీఫ్ విప్‌గా ప్రసాదరాజుకు (prasada raju) ఇచ్చారు జగన్.
