వైఎస్ఆర్  జగనన్న  శాశ్వత  భూహక్కు, భూముల రీ సర్వేపై ఏపీ సీఎం జగన్   ఇవాళ  సమీక్ష నిర్వహించారు.  భూముల సర్వే పూర్తి చేసి  లబ్దిదారులకు  భూహక్కు పత్రాలు అందించాలని  ఆదేశించారు.

 అమరావతి: తొలి విడతలో సర్వే పూర్తైన రెండువేల గ్రామాల్లో లబ్దిదారులకు భూ హక్కు పత్రాలు అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూముల సమగ్ర రీసర్వే పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ .జగన్‌ సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు.వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం కోరారు. తొలివిడత సర్వే పూర్తైన 2వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యుటేషన్లు జరిగాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. అంతేకాదు 7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేసినట్టుగా అధికారులు సీఎంకు చెప్పారు.19 వేల భూవివాదాలను పరిష్కరించినట్టుగా అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో ప్రజలకు రూ.37.57 కోట్ల మేరకు ఆదా అయిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.మరో 2వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించిన ప్లాన్ ను అధికారులు సీఎంకు వివరించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నాటికి ఈ రెండు వేల గ్రామాలకు చెందిన లబ్దిదారులకు కూడా భూ హక్కు పత్రాలను అందిస్తామని అధికారులు తెలిపారు. 

సమగ్ర సర్వే కార్యక్రమం సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని సీఎం కోరారు. గ్రామ సచివాలయంలో కావాల్సినంత మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇందు కోసం సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకోవాలని సీఎం సూచించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో కావాల్సిన సిబ్బందిని నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఖాళీలున్నచోట వెంటనే నియామకాలు చేపట్టాలని సీఎం కోరారు. 22– ఏ సమస్య పరిష్కరించి హక్కు పత్రాలు అందజేసిన లబ్ధిదారులకు లేఖలు రాయాలని అధికారులను కోరారు సీఎం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి వారికి జరిగిన మేలు గురించి ఆ లేఖలో ప్రస్తావించాలని సీఎం సూచించారు. సమగ్ర భూసర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలని సీఎం. అధికారులను ఆదేశించారు.వచ్చే ఏడాది మార్చి నాటికి సర్వేకు అవసరమైన రాళ్లు సిద్దంగా ఉంటాయని అధికారులు సీఎంకు చెప్పారు. 

 రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 4119 వార్డు సచివాలయాల్లో ఇప్పటికే సర్వే కోసం అవసరమైన బృందాలకు శిక్షణ కూడా పూర్తి చేసినట్టుగా అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. హద్దుల మార్కింగ్, రోవర్ల సహాయంతో జీసీపీ ఐడెంటిఫికేషన్‌ ప్రక్రియను 2023 జనవరి నెలాఖరునాటికి పూర్తిచేస్తామన్న అధికారులు చెప్పారు.ఇప్పటివరకు 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 3,37,702 ఎకరాలు భూమిని గుర్తించినట్టు అధికారులు వివరించారు. వచ్చే ఏడాది జూలై నాటికి పట్టణ ప్రాంతాల్లోనూ సమగ్ర సర్వే హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు వివరించారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయడు, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్‌ , ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, మైనింగ్‌ శాఖ డైరెక్టర్‌ వీ జీ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.