ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమమం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య వివాహాలు చేసుకున్న 12,132 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 87.32 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కడం ద్వారా జమ చేశారు. లబ్దిదారుల ఖాతాల్లోకి నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ పథకాల పొందేందుకు పదో తరగతి అర్హతకు తీసుకొచ్చామని ప్రస్తావించారు.
ఈ క్రమంలో కనీసం పదో తరగతి వరకు అయినా పేద పిల్లలు చదువుకుంటారని సీఎం జగన్ అన్నారు. అమ్మాయికి 18 ఏళ్లు.. అబ్బాయికి 21 ఏళ్లు కనీస వయసు నిర్దారించామని చెప్పారు. 18 ఏళ్ల నిబంధన వల్ల కనీసం డిగ్రీ వరకు చదివే వెసులుబాటు ఉంటుందని అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అందుకు తోడ్పడతాయని చెప్పారు. చదువుతోనే ప్రతి పేద కుటుంబం ఉన్నత స్థాయికి వస్తుందని చెప్పారు.
గత ప్రభుత్వం ఇస్తామంటే ఇచ్చామన్నట్టుగా, చేశామంటే చేశామన్నట్టుగా చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిత్తశుద్దితో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని చెప్పారు. గత ప్రభుత్వం 17,709 జంటలకు ఇచ్చేదే తక్కువంటే.. ఇచ్చే సొమ్మును కూడా ఎగ్గొట్టిందని మండిపడ్డారు. గతంలో మాదిరిగా కాకుండా అందరికి మంచి చేయాలని తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్ల నుంచి లబ్దిదారులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు సంతోషం వ్యక్తం చేశారు.
