వైయస్ఆర్ కడప జిల్లా మామిళ్ళపల్లె శివారులో ముగ్గు రాయి క్వారీలో జరిగిన పేలుడు ఘటనలో పలువురు దుర్మరణం చెందటం పట్ల ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఈ పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కాగా, శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ  భారీ పేలుడులో పది మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. పేలుడు పదార్థాల బ్లాస్టింగ్ లో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి ముగ్గురాళ్ల గనిలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల క్రషర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురాయిని వెలికి తీసేందుకు కూలీలు వెళ్లారు. ఆ సమయంలో పేలుడు సంభవించింది.

కడప జిల్లాలో భారీ పేలుడు: పది మంది కూలీల దుర్మణం...

సంఘటనా స్థలం అటవీ ప్రాంతంలో ఉంటుంది. పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి బయలుదేరారు. ఏడు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి.

డిటొనేటర్ పేలుడు వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. గాయపడినవారిని వివిధ ప్రాంతాల ఆస్పత్రులకు తరలించే పనిచేస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ముగ్గురాయిని పేల్చేందుకు డిటొనేటర్ వాడుతారు. రోజువారీ పనిలో భాగంగానే డెటొనేటర్ ను అమర్చారు. అది పేలిన సమయంలో కూలీలంతా అక్కడే ఉన్నారు.