వైవీకి పార్టీ బాధ్యతలు, టీటీడీ చైర్మెన్ గా భూమన : సంక్రాంతి తర్వాత ప్రమాణం
టీటీడీ చైర్మెన్ గా భూమన కరుణాకర్ రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం టీటీడీ చైర్మెన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను కట్టబెట్టే అవకాశం ఉంది.
అమరావతి: టీటీడీ చైర్మెన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీటీడీ చైర్మెన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ ఉత్తరాంధ్ర పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించనున్నారని సమాచారం.దీంతో టీటీడీ చైర్మెన్ బాధ్యతలనుండి వైవీ సుబ్బారెడ్డిని తప్పించి భూమన కరుణాకర్ రెడ్డికి బాధ్యతలను కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం. అంతేకాందు టీటీడీ పాలకమండలిలో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. టీటీడీ కొత్త చైర్మెన్ , పాలకమండలి వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ బాధ్యతలను అప్పగించారు. 2019 జూన్ 22న తొలిసారి గా వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల తర్వాత టీటీడీ చైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డికే బాధ్యతలను అప్పగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 2021 జూన్ 22న వైవీసుబ్బారెడ్డి టీటీడీ చైర్మెన్ గా పదవీ కాలం ముగిసింది. దీంతో 2021 ఆగష్టు 8వ తేదీన వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మెన్ గా రెండో సారి నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.తొలి దఫా వైవీ సుబ్బారెడ్డి చైర్మెన్ గా టీటీడీ పాలకవర్గంలో 33 మంది సభ్యులున్నారు.
2023లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలని వైసీపీ లక్ష్యంగా ముందుకు సాగుతుంది. విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తామని కడూా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని విజయపథం వైపునకు తీసుకెళ్లేందుకు గాను వైవీ సుబ్బారెడ్డికి పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే టీటీడీ చైర్మెన్ బాధ్యతల నుండి వైవీ సుబ్బారెడ్డిని తప్పించి పార్టీ పూర్తి స్థాయి బాధ్యతలను ఇవ్వనున్నారని ప్రచారం సాగుతుంది.
విశాఖపట్టణంలో ఇప్పటికే వైసీపీ స్వంత భవన నిర్మాణ పనులకు ఇటీవలనే శంకుస్థాపన చేశారు ఆ పార్టీ నేతలు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. విశాఖలో నిర్మించే పార్టీ కార్యాలయం రానున్న రోజుల్లో పార్టీ రాష్ట్ర కార్యాలయంగా మారనుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతం టీడీపీకి కంచుకోటగా ఉండేది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఈ ప్రాంతంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీని చావుదెబ్బ కొట్టి వైసీపీ మెజారిటీ స్థానాల్లో గెలిచేలా ఆ పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రపై పట్టు సడలకుండా ఉండేందుకు వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించాలని పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.