ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలను దగ్గుబాటి కుటుంబం బేఖాతరు చేయనుంది. పురంధేశ్వరి బిజెపిలోనూ, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు తమ పార్టీలోనూ ఉండడం జగన్ కు నచ్చలేదు. దీంతో ఇరువురు ఏదో ఒక పార్టీలో ఉండాలని ఆయన షరతు పెట్టారు.

అయితే, దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయంగా సైలెంట్ కావాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్ పెట్టిన షరతుపై తీవ్రంగా చర్చించుకున్న తర్వాత దగ్గుబాటి కుటుంబం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

అమెరికా నుంచి పురంధేశ్వరి గురువారం హైదరాబాదు చేరుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తమ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణపై దగ్గుబాటి అనుచరులు శనివారం పర్చూరులో సమావేశం అవుతున్నారు. 

కుమారుడు హితేష్ భవితవ్యం గురించి మాత్రమే తాను ఆలోచించానని, అయితే తన కోసం మీరు ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దని హితేష్ కన్నీటి పర్యంతమయ్యారని పురంధేశ్వరి తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. పరిణామాలను, పరిస్థితులను పరిశీలించిన తర్వాత తాను రాజకీయంగా మౌనంగా ఉండడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పినట్లు తెలుస్తోంది. పరిణామాలన్నింటినీ వివరిస్తూ దగ్గుబాటి ప్రజలకు బహిరంగ లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది.