అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూములపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలోని సంపన్న నేతల పాలిటి శాపంగా మారనుంది. రాజధాని నిర్మాణం కోసం ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఎ) చేపట్టిన భూసేకరణలో భాగంగా అసైన్డ్ భూములను కూడా సేకరించింది.

ఈ అసైన్డ్ భూముల్లోని నివాసిత, వాణిజ్యపరమైన స్థలాలను అసలు యజమానులకు కేటాయించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించడానికి ముందు, తర్వాత టీడీపీ నేతలు పెద్ద యెత్తున అక్కడ భూములను కొనుగోలు చేశారు. అందులో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పేదల నుంచి ఆ భూములను వారు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. 

కొన్ని భూములను బినామీల పేర్ల మీద కూడా కొనుగోలు చేశారు. అమరావతి కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో 2028 ఎకరాలు అసైన్డ్ భూములే. దాంతో అసైన్డ్ భూములు చాలా వరకు చేతులు మారాయి. ఆ భూములను పేదల నుంచి కొనుగోలు చేసి సీఆర్డీఎకు నివాసిత, వాణిజ్యపరమైన ప్లాట్లుగా అభివృద్ధి చేయడానికి అప్పగించారు. 

దానికితోడు సీఆర్డిఎ పరిధిలోని మరో 348 ఎకరాల భూములు కూడా చేతులు మారాయి. అమరావతిని అభివృద్ధి చేసిన తర్వాత ఆ భూముల ధరలు పెద్ద యెత్తున పెరుగుతాయనే విషయం అందరికీ తెలసిందే. భూములను తమకు విక్రయించకపోతే, ప్రభుత్వం ల్యాండద్ పూలింగ్ కింద లాగేసుకుంటుందని అప్పట్లో పేదలను భయపెట్టి వాటిని సొంతం చేసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. 

ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినవారికి ప్రతి ఎకరానికి వేయి చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్, 450 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్ చొప్పున ఇస్తామని గత చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అసెన్డీ ల్యాండ్స్ ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణపై అప్పట్లో మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ బదిలీ కూడా అయ్యారు.