అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కొద్ది రోజుల్లో పుకార్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టే అవకాశం ఉంది. పక్కా ప్రణాళికతో ఆయన అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుడుతూ అన్ని రకాల ప్రచారాలకు చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. రాజధానిగా అమరావతిని కొనసాగించేందుకే ఆయన సుముఖంగా ఉన్న ట్లు తెలుస్తోంది. 

రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే హైకోర్టును కర్నూలుకు తరలించాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 1937లో కుదిరిన శ్రీబాగ్ ఒడంబడిక మేరకు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. 

రాష్ట్రం విడిపోతే కనుక హైకోర్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజనపై అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సును పాక్షికంగా అమలు చేస్తూ బెంచ్ ను మాత్రమే బెంచ్ ను ఏర్పాటు చేస్తూ ఐటి పరిశ్రమలకు కేంద్రంగా విశాఖను రూపుదిద్దాలని ఆయన అనుకుంటున్నారు. 

హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంపై, విశాఖలో దాని బెంచ్ ఏర్పాటు చేసే విషయంపై జగన్ ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ తోనూ కేంద్ర న్యాయ శాఖ మంత్రితోనూ చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడిపోయిన తర్వాత ఎపి హైకోర్టును తాత్కాలికంగా భవనాల్లో నడుపుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. గత డిసెంబర్ లో అమరావతిలోని తాత్కాలిక భవనాలకు ఎపి హైకోర్టు వచ్చింది. 

అదే సమయంలో పాలనాపరమైన వికేంద్రీకరణ గురించి జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించినట్లు తెలుస్తోంది. అమరావతి సచివాలయం, రాజభవన్, శానససభ, శాసనమండలిలతో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా మాత్రమే ఉంటుంది. అదే సమయంలో జగన్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుత రాజధాని గ్రామాలు కొన్ని కొండవీటి వాగు ముంపునకు గురవుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మంగళగిరి ప్రాంతానికి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని జగన్ అనుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు (హెచ్ఓడీలు) గుంటూరు, విజయవాడ అద్దె భనవాల్లో నడుస్తున్నాయి. వీటికి అద్దెలు తడిసిమోపడవుతూ రాష్ట్ర ఖజానాపై భారం పుడతోంది. 

ఈ పరిస్థితిలో హెచ్ఓడీలను మంగళగిరి శానససభా నియోజకవర్గం పరిధిలోని కాజ గ్రామానికి తరలించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ గ్రామం 65 నెంబర్ జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉంటుంది. హెచ్ఓడీల ఏర్పాటుకు కాజ గ్రామంలోని రామకృష్ణ వెనిజుయా అపార్టుమెంట్ల కొనుగోళ్లకు ప్రభుత్వం బేరసారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. 

తద్వారా రాజధానిని తరలిస్తారనే ప్రచారానికి బ్రేక్ లు వేయాలని జగన్ భావిస్తున్నారు. రామకృష్ణ వెనిజుయా అపార్టుమెంట్లకు నిర్వాహకులు 800 కోట్ల రూపాయల ధరను చెబుతుండగా ప్రభుత్వం రూ. 600 కోట్లకు బేరమాడుతున్నట్లు సమాచారం. 

అమరావతిని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా కొనసాగిస్తూ విశాఖను ఐటి హబ్ గా, తిరుపతిని టెంపుల్ సిటీగా, చిత్తూరును పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దాలనేది జగన్ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నట్లుగా రాజధానిని అమరావతిని తరలించే ఉద్దేశం జగన్ కు లేదని అంటున్నారు.

టీడీపి నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ అమరావతి నుంచి రాజధానిని తరలించదలుచుకుంటే వైఎస్ జగన్ తాడేపల్లిలో ఎందుకు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారని మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. అయితే, జగన్ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంపై ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు.