విజయనగరం: విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు రచ్చకెక్కుతున్నాయా...? ఇప్పటి వరకు ఉన్న ఇంచార్జ్ లను మార్చేందుకు ఓ కీలక నేత ప్రయత్నాలు చేస్తున్నారా...?గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న తన టీమ్ ను ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా...?

అందులో భాగంగానే నెల్లిమర్ల నియోకవర్గ ఇంచార్జ్ మార్పుకు కారణమా...?నెల్లిమర్ల నియోజకవర్గం వైసీపీలో నెలకొన్న ముసలానికి కారణం గ్రూపురాజకీయాలే కారణమా లేక ఆధిప్యత పోరా...అన్న అంశాలపై రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆ పార్టీకి వెన్నుగా వ్యవహరిస్తున్న వారిలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఒకరు కాగా మరోకరు మాజీమంత్రి పెనుమత్స సాంబశివరాజు. 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెనుమత్స సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉంటూ ఓ వెలుగు వెలుగొందారు. వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ రాజకీయ ఓనమాలు దిద్దింది ఈయన దగ్గరే అనడంలో ఎలాంటి సందేహం లేదు.  

అయితే రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ జగన్ గెలుపు గుర్రాలనే భరిలోకి దింపాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా పెనుమత్స సాంబ శివరాజును తప్పించనున్నట్లు తెలుస్తోంది.  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా, వైసీపీని బలోపేతం చేసిన వ్యక్తిగా సాంబశివరాజుకు పేరుంది. అంతేకాదు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ జిల్లా అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు పనిచేశారు.

ప్రస్తుతం కేంద్రపాలక మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ కన్వీనర్‌ పదవి నుంచి ఆయనను తప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆయన వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. 

వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గం వైసీపీలో అలజడి నెలకొన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఎప్పటికప్పుడు సమన్వయకర్తలను మారుస్తుంటే ఎన్నికల్లో ఫలితాలు వేరుగా వస్తాయంటూ కార్యకర్తలు చెప్తున్నట్లు తెలుస్తోంది. 

పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లిమర్ల నియోకవర్గంలో పార్టీకోసం అహర్నిశలు శ్రమించిన ఆయన్ను కాదని వేరే వారికి ఇస్తే ప్రజల్లో పార్టీపై తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని కొందరు నేతలు భావిస్తున్నారు. 

మాజీఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ బంధువు బడుకొండ అప్పలనాయుడును బరిలోకి దించాలంటూ చేస్తున్న ప్రయత్నాలను కొందరు నేతలు  జీర్ణించుకోలేకోతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా ఏకతాటిపైకి వచ్చి తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. 

గత ఎన్నికల్లో పెనుమత్స సాంబశివరాజు ఆరోగ్యం సహకరించకపోయినా జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం నిర్వహించిన బొబ్బిలి, సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అయితే ఆ ఎన్నికల్లో తన కుమారుడు పెనుమత్స సురేష్‌బాబును మాత్రం గెలిపించుకోలేకపోయారు.  

ఎన్నికల అనంతరం 2016 వరకు పెనుమత్స సురేష్ బాబు వైసీపీ కన్వీనర్ గా వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో సురేష్ బాబు ఓటమిపాలవ్వడంతో అనుభవజ్ఞుడు అయిన ఆయన తండ్రి సాంబశివరాజుకే నెల్లిమర్ల టిక్కెట్టు ఇవ్వాలని భావించిన పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ బాధ్యతలను అప్పగించింది.   

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో పెనుమత్స సాంబశివరాజును తప్పించే ప్రయత్నాలు జరుగుతుండటంతో ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఖర్చును భరించలేరనే ఉద్దేశంతో పెనుమత్సను పక్కన పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.  

ఇకపోతే విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఏనాడు పెనుమత్స సాంబశివరాజే నియోజకవర్గ అభ్యర్థి అంటూ ప్రకటించలేదు. కేవలం విజయనగరం అభ్యర్థిగా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని మాత్రమే ప్రకటించారు. 

కోలగట్లను గెలిపించే బాధ్యత మీదేనని ప్రజలను కోరారు. అయితే పాదయాత్ర సమయంలో పెనుమత్స సాంబశివరాజుకే టిక్కెట్ ఇద్దామంటూ జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా నియోజకవర్గ సమన్వయకర్త మార్పుపై వస్తున్న ప్రచారం ఆ పార్టీ కార్యకర్తలను గందరగోళంలో పడేసింది.