Asianet News TeluguAsianet News Telugu

మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలు.. నాలుగు కార్యక్రమాలపై ఫోకస్.. వైసీపీ ప్రతినిధులకు జగన్ దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

YS jagan Key suggestions to ysrcp cadre at high level meeting with leaders in vijayawada ksm
Author
First Published Oct 9, 2023, 1:05 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని.. రాబోయే నెలల్లో వేసే అడుగుల గురించి తన ఆలోచనలను మీతో పంచుకుంటున్నానని చెప్పారు. వీటిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని, మీటింగ్‌లు పెట్టి చెప్పాలని వైసీపీ ప్రతినిధులను కోరారు. తాను చెప్పే నాలుగు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. 

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇప్పటికే జరుగుతుందని.. దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ కోరారు. గత నెల 30వ తేదీన మొదలుపెట్టిన ఈ కార్యక్రమం.. నవంబర్ 10వ తేదీ దాకా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదని, ఒకవేళ పడిన మంచి వైద్యం అందించాలనే తపనతో, తాపత్రయంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలోని 65 లక్షల ఇళ్లను కవర్ చేస్తున్నామని తెలిపారు. 

ఐదు దశల్లో జగనన్న సురక్ష పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రివెంటివ్ కేర్‌లో దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇది కేవలం ప్రివెంటివ్ కేర్ మాత్రమే కాదని.. వ్యాధుల బారిన పడ్డవారికి చికిత్స అందించడం కూడా ఉందని తెలిపారు. ఆరోగ్య సురక్ష కేంద్రాల ద్వారా వ్యాధులు గుర్తించిన వారికి.. వ్యాధి నయం అయ్యేవరకు చేయి పట్టుకుని నడిపించాలని కోరారు. 

ఆరు నెలలకొకసారి గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ కూడా దీనితో అనుసంధానం అవుతాయని తెలిపారు. ఈ గొప్ప కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. తద్వారా వైసీపీ నాయకులకు ప్రజల ఆశీస్సులు అందిస్తారని.. వారి గుండెల్లో చెరగని స్థానం ఇస్తారని  తెలిపారు. 

వై ఏపీ నీడ్స్ జగన్.. ప్రజల ఆశీస్సులతో, ప్రజలకు సేవ చేయడానికి మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం అని జగన్ అన్నారు. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నట్టుగా తెలిపారు.  డిసెంబర్ 10 వరకు దాదాపు 40 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో రెండు ముఖ్యమైన దశలు ఉంటాయని తెలిపారు. అందులో మొదటిది.. సచివాలయాలను సందర్శించడం, రెండోది.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి 65 లక్షల ఇళ్లలో ప్రతి గడపకు వెళ్లడం అని చెప్పారు. సచివాలయాలను సందర్శించినప్పుడు.. ఆ గ్రామ పరిధిలో జరిగిన అభివృద్ది, సంక్షేమాన్ని వివరించాలని, గ్రామ స్థాయి నాయకులతో మండల స్థాయి నాయకులతో మమేకం కావాలని, ఆ తర్వాత గ్రామంలో వేరేచోట పార్టీ జెండా ఎగరవేయాలని, గ్రామంలోని పెద్దలను వారి వద్దకు కలిసి, వారి ఆశీస్సులు తీసుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవం స్పీచ్‌లో ఉన్న అంశాలను మండల స్థాయిలో ఉన్న నాయకులు అర్థం చేసుకుని.. దానిని గ్రామస్థాయి నాయకులకు, ప్రజలకు వివరించాలని కోరారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను ఏ విధంగా నెరవేర్చలేదో కూడా వివరించాలని కోరారు. వాలంటీర్లు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తే.. వైసీపీ ప్రతినిధులు గత ప్రభుత్వంలో జరిగిన మోసాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని చెప్పారు. 

బస్సు యాత్రలు.. బస్సు యాత్రలు అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు సాగుతాయని వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు జరుగుతాయని తెలిపారు. ఒక్కో టీమ్‌లో పార్టీకి చెందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు అందరూ ఉంటారని.. స్థానిక ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ కన్వీనర్ ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో మీటింగ్‌లు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రతి రోజు  మూడు మీటింగ్‌లు జరుగుతాయని తెలిపారు. ఈ మీటింగ్‌లో ప్రభుత్వం చేసిన మంచి, అభివృద్ది గురించి, తీసుకొచ్చిన మార్పుల గురించి.. వివరించే ప్రయతం చేయాలని సూచించారు. బస్సుపై నుంచే అన్ని సామాజికవర్గాలకు చెందిన నేతలు ప్రసంగిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలని కోరారు. ఇది మాములు బస్సు యాత్ర కాదని.. సామాజిక న్యాయ యాత్ర అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పేదవాడికి, పెత్తందారులకు మధ్య యుద్దం జరగబోతుందని.. అందులో పేదవాడి పార్టీ వైసీపీ అని అన్నారు. రేపు జరగబోయేది కులాల యుద్దం కాదని.. క్లాస్ వార్ అని చెప్పారు. పేదవాళ్లు మొత్తం ఏకం అయితేనే.. పెత్తందార్లను గట్టిగా ఎదుర్కొగలుగుతామని తెలిపారు. 

ఆడుదాం ఆంధ్రా.. డిసెంబర్ 11 నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం మొదలుకానుందని చెప్పారు. డిసెంబర్ 11 నుంచి సంక్రాంతి వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఈ క్రీడా సంబరాన్ని నిర్వహిస్తుందని.. గ్రామస్థాయిలో క్రీడల్లో నైపుణ్యం ఉన్నవారిని గుర్తించడమే ప్రభుత్వ లక్ష్యమని  చెప్పారు. భారతదేశ టీమ్‌ల్లో వై నాట్ ఆంధ్రప్రదేశ్‌ అనే ఉద్దేశంతో జరుగుతుందని చెప్పారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుగా చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios