అమరావతి: ఔట్ సోర్సింగ్ విధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎపి రాజధాని, రాష్ట్రాభివృద్ధిపై కూడా జగన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ లో దళారీ వ్యవస్థను రద్దు చేయడానికి అవసరమైన నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. 

ఔట్ సోర్సింగ్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన భావిస్తున్నారు. దీన్ని అమలు చేయడానికి, దళారీ వ్యవస్థను రద్దు చేయడానికి వీలుగా రాష్ట్రస్థాయిలో కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ కార్పోరేషన్ పనిచేయనుంది. ఈ నెల 16వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 

ఎపి రాజధాని, రాష్ట్రాభివృద్ధిపై కమిటీ ఏర్పాటు చేస్తూ దాని విధివిధానాలపై జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఎపి రాజధాని, రాష్ట్రాభివృద్ధిపై ఆ కమిటీ నివేదిక సమర్పిస్తుంది. ఎపి రాజధాని వ్యవహారంపై సంప్రదింపులు జరిపే బాధ్యతను కమిటీకి అప్పగించనున్నారు. 

స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా గల అధికారి నేతృత్వంలో నిపుణుల కమిటీ అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది.