2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేతలకు గట్టి హెచ్చరికలు చేశారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. త్వరలో సర్వే నిర్వహిస్తామని.. గెలవరని తేలితే టికెట్ ఇచ్చేది లేదని ఆయన తేల్చిచెప్పారు.  

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను (ap assembly election 2024) దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడ్డారు వైసీపీ (ysrcp) అధినేత, సీఎం జగన్ (ys jagan) . దీనిలో భాగంగా బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మే 10 నుంచి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు పర్యటించాలని ఆదేశించారు. 

ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజలు వివరించాలని సూచించారు. పార్టీ పరంగా వున్న వివిధ విభాగాలను యాక్టివేట్ చేయాలని జగన్ సూచించారు. విభేదాలు ఎట్టి పరిస్ధితుల్లో వుండకూడదని.. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా చేస్తున్నట్లు చెప్పారు. వారికి కేబినెట్ హోదా ఇస్తున్నామని.. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలవుతాయని జగన్ తెలిపారు. మే నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నామని.. అందరూ సన్నద్ధం కావాలని జగన్ పేర్కొన్నారు. 

175 సీట్లకు 175 ఎందుకు రాకూడదని ఆయన ప్రశ్నించారు. గతంలో కుప్పంలో మనం గెలవలేదని.. కానీ అక్కడ స్థానిక ఎన్నికల్లో గెలిచామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గడప గడపకు వైసీపీ సర్వే నిర్వహిస్తామని... సర్వేలో రిజల్ట్ బాగా వచ్చినోళ్లకే సీట్లు ఇస్తామని, గెలవరని సర్వేలో తేలితే నో సీట్ అని ఆయన తేల్చిచెప్పారు. గెలవండి .. గెలిపించండి అంటూ జగన్ పిలుపునిచ్చారు. యుద్ధం చంద్రబాబుతోనే కాదు.. ఎల్లో మీడియాతోనూ చేస్తున్నామని సీఎం అన్నారు. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని... జులై 8న ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు జగన్ తెలిపారు. 

పార్టీ అన్నది సుప్రీం అన్న ఆయన... పార్టీ పరంగా నిరంతరం దృష్టి, ధ్యాస వుండాలని సూచించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొదట్లో చెప్పానని గుర్తుచేశారు. పార్టీ బాగుంటేనే మనం బాగుంటామని.. మే 10 నుంచి పార్టీ కార్యక్రమాలు ముమ్మరవుతాయని చెప్పారు. మే నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకూ ప్రారంభిస్తారని.. ప్రతి ఎమ్మెల్యే నెలకు 10 సచివాలయాల్లో పర్యటించాలని, ప్రతి సచివాలయంలోనూ 2 రోజులు తిరగాలని జగన్ ఆదేశించారు. గడప గడపకూ పూర్తి కావడానికి 8 నుంచి 9 నెలలు పడుతుందని.. దీని వల్ల ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.