అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని భావించింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు కావడంతో హోస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికి మాత్రమే పరిమితం చేయాలని, ఆయన బయటకు రాకుండా చూడాలని నిమ్మగడ్డ డిజిపీకి ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. డీజీపీకి, ఎస్పీకి ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారు. 

ఈ నెల 21వ తేదీ వరకు పెద్దిరెడ్డిపై ఆంక్షలను అమలు చేయాలని ఆయన చెప్పారు. మీడియాతో కూడా మాట్లాడేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనుమతించకూడదని ఆయన అన్నారు. ఎన్నికలు నిర్భయంగా జరిపించడానికే ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. 

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయడంపై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలని, ఏకగ్రీవాలను ప్రకటించకపోతే ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను అమలు చేయకూడదని ఆయన రిటర్నింగ్ అధికారులకు సూచించారు  నిమ్మగడ్డ ఆదేశాలను పాటించే అధికారులను బ్లాక్ లిస్టులో పెడుతామని ఆయన హెచ్చరించారు. 

దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రంగా ప్రతిస్పందించారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడిన విషయాలు ప్రచురితమైన పత్రికల కట్టింగ్స్ ను కూడా నిమ్మగడ్డ తన లేఖకు జత చేశారు. ఎన్నికలు సజావుగా జరగడానికే పెద్దిరెడ్డిపై ఆంక్షలు పెడుతున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు.