అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా సిదిరి అప్పలరాజు, వేణుగోపాల్ లు బుధవారం నాడు ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీరితో ప్రమాణం చేయించారు.

బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటిగంటన్నర తర్వాత కొత్త మంత్రుల ప్రమాణం చేయించారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్‌తో తొలుత గవర్నర్ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సిదిరి అప్పలరాజుతో గవర్నర్ ప్రమాణం చేయించారు.మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వేణుగోపాల్ ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కారం చేశారు. అప్పలరాజు మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత గవర్నర్ కాళ్లకు మొక్కారు. సీఎం జగన్ కాళ్లకు నమస్కారం పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తే జగన్ వారించాడు. 

కరోనా కారణంగా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అతి తక్కువ మందికే అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డితో పాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఈ కార్యక్రమానికి అనుమతి లభించలేదు. దీంతో వారు రాజ్ భవన్ గేటు బయటి నుండే వెళ్లిపోయారు.ఈ కార్యక్రమం అత్యంత నిరాడంబరంగా సాగింది.

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేయడంతో వారి స్థానంలో వీరిద్దరికి జగన్ అవకాశం కల్పించారు.