టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజవర్గానికి వైఎస్ జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద రూ.100 కోట్లతో నియోజకవర్గంలో మంజూరైన 2 వేల ఇళ్లను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రెండు వేల ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే పరమాలపల్లె వద్ద 354 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇందులో చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను నాలుగు మండలాల్లో ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మంజూరు చేసుకుంటూ పోయారు.

మరికొందరు లబ్ధిదారులకు వారి సొంత స్థలంలోనే ఇళ్లిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్దినెలల ముందు చంద్రబాబు ప్రభుత్వం సామూహిక గృహ ప్రవేశాలను నిర్వహించింది. అలాగే కుప్పం మండలంలోనే 2 వేల ఇళ్లకు పరిపాలనాపరమైన అనుమతులు సైతం ఇచ్చింది.

ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి ఇళ్లను కేటాయించింది. 354 ఇళ్లు నిర్మాణంలో ఉన్న పరమాలపల్లె పరిధిలోనే వాటికి సమీపంలో స్థలాన్ని కేటాయించింది. స్థల లభ్యత తక్కువగా ఉండటంతో జీ ప్లస్ టూ తరహాలో ఇళ్ల నిర్మాణానికి అధికార యంత్రాంగం నిర్ణయించింది.

ఒక్కో ఇంటి వ్యయాన్ని రూ.4.5 లక్షలుగా పేర్కొంది. దీనితో పాటు ప్రతి ఇంటికీ పరిసరాల సదుపాయాలకు మరో రూ. 50 వేలు కేటాయించింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల వంతున మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.100 కోట్లకు చేరింది.

ఇప్పుడు సదరు 2 వేల ఇళ్లకు ఇచ్చిన పరిపాలనా అనుమతులు రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కుప్పంతో పాటు కృష్ణా జిల్లాలోని కురుముద్దాలిలో 96 ఇళ్లు.. విశాఖ జిల్లాల చోడవరంలోని 3,936 ఇళ్లు కలిపి మొత్తం రాష్ట్రంలో రూ.304 కోట్ల విలువైన 6,032 ఇళ్లను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో వెలువరించింది.

నిర్మాణానికి తగినంత స్థలం దొరక్కపోవడం వల్లే కుప్పంతో సహా మిగిలిన జిల్లాల్లో సైతం ఇళ్లను రద్దు చేసినట్లు జీవోలో తెలిపింది. అయితే కుప్పం నియోజకవర్గంలో కొత్తగా ఇళ్లను మంజూరు చేస్తామంటూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఇళ్లు లేని పేదవారందరికీ ఇళ్లను మంజూరు చేసి, ఉగాది నాటికి ఇంటి పత్రాలు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో మంజూరైన 2 వేల ఇళ్లను స్థలం దొరకని కారణంగా రద్దు చేసినప్పుడు... కొత్తగా మంజూరు చేయబోయే ఇళ్లకు స్థలాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారని కుప్పంలో చర్చ జరుగుతోంది.