ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి రాష్ట్రానికి ఆదాయ మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా ఏపీలో కొత్త ఇసుక పాలసీని తీసుకురానున్నారు. మైనింగ్ అధికారులతో సమావేశమైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుక పాలసీపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే ఇసుక రవాణాను ఆపివేయాలని.. జూలై 1 నుంచి కొత్త ఇసుక పాలసీని అమలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కొత్త పాలసీ వచ్చే వరకు తవ్వకాలు జరిపేందుకు వీలు లేదని.. ఒకవేళ రవాణా ఆపకపోతే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాల్సిందిగా మంత్రి తెలిపారు.

ఇసుకను అక్రమంగా తరలించే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. టీడీపీ హయాంలో వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని.. తమ ప్రభుత్వ హయాంలో ఆదాయం 25 శాతం ఖనిజాలతో వచ్చేలా కొత్త పాలసీ ఉంటుందని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

ఇసుక అక్రమంగా తరలిస్తే జిల్లా కలెక్టర్లదే బాధ్యతని.. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.