విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పారదర్శకత, అవినీతి రహిత పాలన పేరుతో జగన్ పలు ప్రాజెక్టులు, పనులు, కాంట్రాక్ట్ పనులను రద్దు చేస్తున్నారు. ప్రభుత్వం పనులపట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై వేటు వేస్తున్నారు. 

ఇప్పటికే పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ పనులను నిలిపివేయాలని ఆదేశించి కొన్ని గంటలు కూడా గడవక ముందే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్. రాష్ట్రరాజధాని అమరావతిలోని ఇండస్ట్రీయల్ పార్క్ లో పనులు చేపట్టని 22 సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులు రద్దు చేయాలని ఆదేశించారు. 

సీఎం జగన్ ఆదేశాలతో ప్రభుత్వం వీరపనేని గూడెం ఇండస్ట్రీయల్ పార్క్ లో 22 సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులను ఏఐసీసీ రద్దు చేశారు. ఔట్ రేట్ సేల్ కింద కారుచౌకగా భూములు దక్కించుకుని పనులు ప్రారంభించడం లేదని ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా కనీసం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు ఏఐసీసీ అధికారులు.

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో వీరపనేని గూడెం పారిశ్రామిక ప్రాంతం. రాష్ట్రవిభజనకు ముందే ఈ ప్రాంతంలో పలు పరిశ్రమలు నెలకొన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ లో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక సంస్థలు రాజధాని ప్రాంతంలో తమ శాఖలు కేటాయించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

అమరావతి ఇండస్ట్రీస్ అసోషియేషన్ తరపున మెుత్తం 75 పారిశ్రామిక సంస్థలు ముందుకు రాగా 59 సంస్థలకు మాత్రమే ప్లాట్లను కేటాయించింది ప్రభుత్వం. 
మిగిలిన 16 ప్లాట్లను నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ వర్గాలకు కేటాయించాల్సి ఉంది. 

అమరావతి ఇండస్ట్రీస్ అసోషియేషన్ తరపున వచ్చిన ఎంఎస్ఎంఈ సంస్థలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు లేకపోవడంతో వాటిని కేటాయించలేదు. ఇకపోతే ఔట్ రేట్ సేల్ విధానంలో ఎకరానికి రూ.16.50 లక్షలకే విక్రయిస్తూ ఎలాట్మెంట్ చేసింది ఏపీఐఐసీ. 

ప్లాట్ అలాట్ మెంట్ తీసుకున్న ఆరు నెలలలోపు పనులు ప్రారంభించాలి. అంతేకాదు రెండేళ్ళలో వాటి పనులు పూర్తి చేయటంతో పాటు, ఉత్పాదకతను కూడా చేపట్టాల్సి ఉంది.
కానీ ఇప్పటి వరకు 22 పారిశ్రామిక సంస్థలు ఎలాంటి పనులు చేపట్టలేదు. 

వీరపనేని ఇండస్ట్రీయల్ పార్క్ లో పారిశ్రామిక సంస్థలకు రూ.30కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైన్లు, వాటర్ లైన్స్, విద్యుత్ లైన్స్ వంటి పనులు చేసినప్పటికీ పనులు చేపట్టకపోవడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.   
 
పనులు ప్రారంభించని కంపెనీలపై ఆరా తీశారు. ఇప్పటికే ఆ సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు ఏపీఐఐసీ అధికారులు స్పష్టం చేశారు. నోటీసులు జారీ చేసినప్పటికీ సదరు కంపెనీయాజమాన్యం స్పందించకపోవడం లేదని ప్రభుత్వానికి తెలిపింది. 

దాంతో సీఎం జగన్ ఆ కంపెనీలకు భూ కేటాయింపులు రద్దు చేయాలని ఆదేశించారు. దాంతో తేట టేబుల్‌ ఇండస్ర్టీ, అను పార్టనర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , రత్న ఇండోర్‌ అండ్‌ ఫేపకేడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏపీ పార్టనర్స్‌ ప్రై లిమిటెడ్‌, మిత్రా సోలార్‌ ఇండస్ర్టీస్‌, శ్రీ వంశీ ఇంజనీరింగ్‌ వర్క్స్‌ కంపెనీలు ఉన్నాయి. 

వాటితోపాటు అక్షయ సోలార్‌ పవర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ , రెయిన్‌ బౌ, అక్షర టెక్నాలజీస్‌, స్వాతి ఇంజనీరింగ్‌ ఇండస్ర్టీస్‌, హిమశ్రీ ఇంజనీర్స్‌, మెడిక్విక్‌ సర్వీసెస్‌, ఎస్‌వీ టెక్నాలజీస్‌, నాగసాయి ప్రెసిషన్‌ ఇంజనీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జాహ్నవి ఇండియా, ప్రెసిషన్‌ మెటల్‌ టెక్నాలజీస్‌, ప్రసాద్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, ఈకో ఆర్గానిక్స్‌ ల్యాబ్స్‌, మిత్రో ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శ్రీ విజయ ప్రెసిషన్స్‌ టెక్నాలజీస్‌, వెన్సే లైట్‌ మెటల్స్‌ లిమిటెడ్‌, విభ్రాంత్‌ టెక్నాలజీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీలు ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యాయి. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూకేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై 16 సంస్థల యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై హైకోర్టు ఎలాంటి ప్రకటన వెలువరిస్తుందో వేచి చూడాలి.