విశాఖపట్నం : 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చం‍ద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అమలు చెయ్యకుండా తుంగలో తొక్కారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. 

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నంలోని ఆరిలోవ బీఆర్ టీఎస్ రోడ్డులో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేని క్యాబినెట్‌ ఏదైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో కార్పొరేషన్లు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయన్న ఆయన వైసీపీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్‌ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తానన్నారు. టీడీపీ పాలనలో ముస్లింలు అత్యంత వెనుకబడిపోయారని కేవలం ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తారని జగన్‌ విమర్శించారు. 

గుంటూరు జిల్లాలో నిర్వహించిన నారా హమారా.. ముస్లిం హమారా అనే కార్యక్రమం కేవలం ఎన్నికల కోసమే పెట్టారని గుర్తు చేశారు. ముస్లింలకు మంత్రివర్గంలో ఎందుకు ప్రాతినిథ్యం కల్పించ లేదని ప్రశ్రించినందుకు అక్రమంగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ముస్లిం యువకులను భయపెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌ దుల్హన్‌ పథకం ద్వారా వివాహ సమయంలో ప్రతీ ఆడబిడ్డకు లక్ష రూపాయాలు ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. పేద ముస్లిం పిల్లలకు కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందించారన్నారు. 2014లో ఎన్నికల సమయంలో ముస్లింల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని కానీ నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క హామీ కూడా అమలు చెయ్యలేదన్నారు. 

2017-18 బడ్జెట్‌లో ముస్లింల సంక్షేమం కోసం 850 కోట్లు  కేటాయిస్తే కేవలం 350 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా అనేక అబద్దాపు వాగ్దానాలు ఇచ్చారని కానీ అవెక్కడా అమలకు నోచుకోలేదన్నారు. ముస్లింలకు ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి వాటి ద్వారా రుణాలు మంజూరు చేస్తామన్న చంద్రబాబు ఇంత వరకూ ఏర్పాటు చేయలేదన్నారు. 

ఫాతిమా మెడికల్‌ కాలేజ్‌ విద్యార్ధులను అత్యంత ఘోరంగా మోసాం చేశారని గుర్తు చేశారు. కాలేజీ ఫీజుల కడతామని హామీ ఇచ్చి తరువాత మోహం చాటేశారని ఆరోపించారు. చం‍ద్రబాబు పాలనలో ముస్లిం బాలికలపై అత్యాచారాలు జరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. న్యాయం చేయండని పోరాడిన వాళ్లపై అక్రమంగా కేసులు పెడుతూ హింసిస్తున్నారని జగన్ దుయ్యబుట్టారు