ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీగా కొనసాగుతున్న వైసీపీ నేటితో పదో వసంవతంలోకి అడుగుపెడుతోంది. సరిగ్గా పది సంవత్సరాల క్రితం వైఎస్ జగన్ ఇదే రోజున పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

పార్టీని స్థాపించి పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్... ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని తెలియజేశారు. ఆయన చేసిన ఎమోషనల్ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 

 ‘మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైసీపీ నేడు 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సుధీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు, ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ వందనాలు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దేలా మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు జగన్.

 

కాగా... జగన్ పార్టీ స్థాపించడానికి దారి తీసిన కారణాలు అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా ఉన్నసమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు విడిచారు.

 వైఎస్ మరణం తరువాత పేరు కలిసి వచ్చేలా.. శివ కుమార్ అనే వ్యక్తి.. ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతో’ రిజిస్టర్ చేయించారు. ఆ పార్టీలో చేరిన జగన్.. దానికి తానే అధినేత అయ్యారు. తండ్రి పేరు కలిసి వచ్చేలా ఉండటమే అందుకు కారణం.

అప్పటి నుంచి ఆయన పార్టీని నెమ్మదిగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. తన తండ్రి ఆశయాలను తాను నెరవేరుస్తానంటూ ప్రజల్లో నమ్మకం కలిగించాడు. 2014లో వైసీపీ విజయం ఖాయమని అందరూ భావించారు. అయితే.. కొద్దిలో అది మిస్ అయ్యింది. అయినా పట్టు వదలకుండా.. పాదయాత్ర చేసి.. ప్రజల కష్టాలను తెలుసుకొని.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించారు.