టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ...వైసీపీలోకి వెళ్లే మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల వంశీ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా.. దీపావళి తర్వాత తాను పార్టీ మారే విషయాన్ని చెబుతానని వంశీ ప్రకటించారు. అయితే.... వల్లభనేని వంశీ.... వైసీపీలోకి రావడం పట్ల సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

కాకపోతే... తమ పార్టీలోకి రావాలంటే... కచ్చితంగా రాజీనామా చేసి మాత్రమే రావాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలెవరైనా వైసీపీలో చేరాలంటే ముందుగా పదవులకు రాజీనామా చేసి రావాలన్న జగన్‌ నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే వంశీ మెడలో జగన్‌ పార్టీ కండువా వేస్తారని తేల్చిచెప్పాయి.

సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ గెలిచిన రెండు స్థానాల్లో గన్నవరం కూడా ఒకటి. సుజనా చౌదరితో వంశీకి బంధుత్వం ఉంది. సుజనా టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లినప్పటికీ వంశీ ఆయనతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం కూడా ఆయనతో కలిసి గుంటూరు వెళ్లిన వంశీ.. మధ్యాహ్నం విజయవాడలో ప్రత్యక్షమయ్యారు.

 చిరకాల మిత్రుడు, మంత్రి కొడాలి నాని, మరో మంత్రి పేర్ని నానితో కలిసి మధ్యాహ్నం 3గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారు. సుమారు అరగంటకుపైగా జగన్‌తో చర్చలు జరిపారు. ఇటీవల వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు నమోదైంది. ఆ కేసులో పలువురు టీడీపీ నేతలతోపాటు ఆయన్ను 10వ నిందితుడిగా చేర్చారు. 

తనపై అక్రమంగా కేసు పెట్టారని, దీనిపై ఆధారాలతో గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేస్తామని కూడా ప్రకటించారు. గురువారమే వంశీ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
 
ఈ సందర్భంగా పార్టీ మారడంపైనా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. కాగా.. శుక్రవారం టీడీపీ అధిష్ఠానం ఇసుక కొరతపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వంశీ పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో వంశీ పార్టీ మారడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిని వంశీ ఖండించలేదు సరికదా.. శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. 

తాను 2006 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడూ ఇంత స్థాయిలో తన మద్దతుదారులపైన, అనుచరులపైన దాడులు గానీ, ఆస్తులకు నష్టం గానీ జరగలేదని పేర్కొన్నారు. ఈ అంశాలను సీఎంకు వివరించానని చెప్పారు. పార్టీ మారే అంశంపై దీపావళి తర్వాత స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు.