Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ పాలనకు వంద రోజులు: చంద్రబాబుపైనే గురి

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వంద రోజులు తీరిక లేకుండానే వ్యవహరించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన పనులను, తీసుకున్న నిర్ణయాలను తిరగదోడడానికే జగన్ ఎక్కువ సమయం కేటాయించినట్లు కనిపిస్తోంది.

YS Jagan completes 100 days as AP CM
Author
Amaravathi, First Published Sep 6, 2019, 7:38 AM IST

వైఎస్ జగన్  మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నేటికి 100 రోజులయ్యింది. ఇదే సంవత్సరం పార్లమెంటుకు జరిగిన ఎన్నికలతో పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 సీట్లను సాధించి జగన్ చరిత్ర సృష్టించారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఓదార్పు యాత్రతో మొదలైన జగన్ ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులనోర్చి సాగింది. వైసీపీ పార్టీ పెట్టిన నాటినుంచి ప్రజాసంకల్ప యాత్రను పూర్తిచేసి అధికారంలోకి వచ్చేంతవరకు ఒక్కో మెట్టు ఎక్కుతూ, జగన్ ప్రజలకు మరింత చేరువయ్యాడు. 

మే నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ నిన్నటితో 99 రోజుల పాలనను పూర్తిచేసుకున్నాడు. నేడు ఈ సెప్టెంబర్ 6వ తేదీన 100వ రోజు. ఈ సందర్భంగా జగన్ ఈ 100 రోజులలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు. పరిపాలనపై ఎలాంటి ముద్ర వేసాడు? ముందున్న సవాళ్లేంటి, మూటగట్టుకున్న వివాదాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. 

కేవలం 100రోజుల్లోనే ఒక ప్రభుత్వ పరిపాలనపై ఒక అభిప్రాయానికి రావడం కష్టం. ఎందుకంటే కొత్తగా ప్రవేశపెట్టిన ఏ పథకమైనా అనుకున్న రీతిలో  ఫలాలను అందించిందా లేదా అని డిసైడ్ చేయలేము. కాకపోతే ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో మాత్రం మనకు అర్థమౌతుంది కాబట్టి వాటి పనితీరును మాత్రం అంచనా వేయగలం. 

మొదటగా మాట్లాడుకోవాలిసింది నవరత్నాల గురించి. వైసీపీ మ్యానిఫెస్టొ పూర్తిగా ఈ నవరత్నాలపైన్నే నిర్మితమైంది. అధికారంలోకి రాగానే జగన్ వీటి అమలుకు శ్రీకారం చుట్టాడు. 2017లోనే గుంటూరులో జరిగిన ప్లీనరీలో రత్నాల్లాంటి 9 పథకాలను తీసుకొస్తాను అని చెప్పిన జగన్, అన్నట్టుగానే ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే వాటిపైన్నే పూర్తిగా తన దృష్టిని కేంద్రీకరించాడు. 

ఈ నవరత్నాల్లో మొదటగా మాట్లాడుకోవాల్సింది రైతు భరోసా గురించి. ఏటా రైతుకు పెట్టుబడి సహకారం కింద డబ్బులతో పాటు ఉచితంగా బోర్లు, ధరల స్థిరీకరణ నిధి, వడ్డీ లేని రుణాలు ఇతరాత్రా హామీలను కూడా ఈ రైతుభరోసా కింద పొందుపరిచారు.  భారతదేశమంతటా రైతులు సహాయం కోసం ఎదురుచూస్తున్నవేళ ఇలా రైతుకు నేరుగా సహకారం అందించడం ఒక మహోన్నతమైన విషయం. అందరికీ అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్ర అంటున్న వేళ ఇదో గొప్ప ముందడుగుగా చెప్పవచ్చు. 

ఫీజు రీఎంబర్సుమెంటు, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం,అమ్మఒడి, ఆసరా, మద్యపాన నిషేధం, పేదలకు ఇళ్ళు, పెన్షన్ల పెంపు ఇలా అన్నిటిమీదా జగన్ దృష్టి కేంద్రీకరించాడు. ఇందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మద్యపాన నిషేధం గురించి. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో ప్రధాన ఆదాయ మార్గాల్లో ఒకటైన మద్యం పైన దశల వారీగా నిషేధాన్ని ఆలుచేయాలనుకోవడం సాహసంతో కూడిన గొప్ప నిర్ణయంగా చెప్పవచ్చు. దాన్ని చెప్పడమే కాకుండా ఆచరణలో పెట్టి చూపిస్తున్నాడు కూడా. 

నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ ఎందరో నిరుద్యోగుల్లో కూడా ఆశలు నింపిన జగన్ చెప్పినట్టుగానే భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టాడు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల నుంచి గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల వరకు దాదాపుగా 1.5 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసాడు. అందులో చాలా పోస్టులకు పరీక్షలను నిర్వహించారు కూడా. లక్ష ఉద్యోగాలు ఇస్తాము అని కెసిఆర్ చెప్పి కూడా చేయకపోగా, జగన్ మాత్రం ఇంత భారీ స్థాయిలో ఉంటాయని చెప్పుకున్నప్పటికీ లక్షపైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయడానికి పూనుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. 

మరో చర్చింకోదగ్గ విషయమేమన్నా ఉందంటే అది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఎన్నికలవేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ అధికారంలోకి రాగానే ఈ విషయమై ఆంజనేయ రెడ్డి కమిటీని వేసాడు. కమిటీ రిపోర్టును అందించగానే,  కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు. 

ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయని ఈ తక్కువ సమయంలో నిర్ధారణకు రాలేము. కాకపోతే మంచి కార్యక్రమాల దిశగా రాష్ట్రం ముందడుగులైతే వేసిందని మాత్రం చెప్పగలం. 

ఇన్ని మంచిపనులకు శ్రీకారం చుట్టిన జగన్ పాలన కొన్ని వివాదాలను కూడా మూటగట్టుకుంది. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రాష్ట్ర రాజధాని అమరావతి గురించి. ఎప్పటి నుంచో అమరావతిపైన అంతగా  ఆసక్తిచూపని జగన్ అదే పరంపరను కొనసాగిస్తూ బడ్జెట్లో కేవలం 500 కోట్లను మాత్రమే కేటాయించాడు. 

ఈ సమయంలోనే రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచ బ్యాంకు, ఆసియన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు తప్పుకున్నాయి. ఇది ఇలా ఉండగానే రాజధాని అమరావతిలోని కొనసాగుతుందా అనే అనుమానానికి తావిచ్చేలా బొత్స సత్యనారాయణ ఒక ప్రకటన చేసారు. వెనువెంటనే రీజినల్ బోర్డుల ఏర్పాటు నిర్ణయం, ఇలా అన్ని వెరసి ప్రజలు సందిగ్ధావస్థలో పడ్డారు. 

అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఈ సమస్యను మరింత జఠిలం చేసారే తప్ప ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చూపెట్టలేకపోయారు. 

మరో వివాదాస్పద అంశానికొస్తే అది ఖచ్చితంగా పోలవరమే అవుతుంది. కొత్తగా పిలిచే టెండర్లకు రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా కాంట్రాక్టులను అప్పగిస్తే ఎటువంటి సమస్యా ఉండేది కాదు. కాకపోతే పాత టెండర్లను రద్దు చేస్తానందంతోనే అసలు సమస్య మొదలయ్యింది. ఇలా పాత టెండర్లను రద్దుచేస్తే పెట్టుబడిదారులు తమ విశ్వాసాన్ని కోల్పోతారని, భవిష్యత్తు పెట్టుబడులు ప్రమాదంలో పడతాయని కేంద్రం పదే పదే చెప్పినాకూడా వినకుండా ముందుకెళ్లాడు. 

ఈ విషయంలో కోర్టు కూడా ప్రభుత్వాన్నే తప్పుబట్టింది. అయినా కాంట్రాక్టును ఎక్కువ రేటుకు ఏదన్నా కంపెనీ దక్కించుకుందంటే, అప్పటి అధికారుల తప్పు అవుతుంది కానీ కంపెనీని నేరుగా తప్పుబట్టలేము. కంపెనీ అవినీతికి పాల్పడింది అని సాక్ష్యాధారాలతో నిరూపించకుండా కాంట్రాక్టులను రద్దు చేయడం చట్టప్రకారంగా కూడా చెల్లదని నేరుగా కోర్ట్ తేల్చింది కూడా. 

ఇంకో దుమారం లేపిన అంశం,విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు. ఈ విద్యుత్ ఒప్పందాలవల్ల రోజుకి 7కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని చెబుతోంది ప్రభుత్వం. కాకపోతే ఇక్కడే ఒక సమస్య ఉంది. ఈ పెట్టుబడులు పునరుత్పాదక విద్యుత్ తయారీలో భాగంగా నెలకొల్పిన ప్రాజెక్టుల్లోనివి. వీటిల్లో ఎన్నో విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. వీటిని రద్దు చేస్తే కూడా పైన పేర్కొన్నట్టు పెట్టుబడిదారులు తమ విశ్వాసాన్ని కోల్పోతారు. కేంద్రం ఈ పి పి ఏల విషయంలో చాలా సీరియస్ గా ఉంది. 

ప్రైవేట్ రంగంలో కూడా 75% రేజర్వేషన్లు అనే నిర్ణయం ఏదైతే ఉందో, అది పారిశ్రామికవేత్తల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తుంది. అసలే ఎటువంటి భారీ పరిశ్రమలు లేని రాష్ట్రం. ఇలాంటి సమయంలో పరిశ్రమలకు ఎర్ర తివాచీలు పరిచి పెట్టుబడులను ఆకర్షించాల్సిందిపోయి, ఇలా మరింత కఠిన నియమాలను పెట్టడం రాష్ట్రంలో పెట్టుబడులను దెబ్బతీస్తోంది. 

పేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నా కాంటీన్లను మూసివేశారు. ఈ చర్య వల్ల ప్రజల్లో ఎంతో కొంత అపవాదునైతే మూటకట్టుకున్నాడు జగన్. ఈ వంద రోజుల్లో చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని ఎండగట్టడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించాడని మాత్రం అనిపిస్తుంది. 

ఇలా చంద్రబాబును పదేపదే టార్గెట్ చేస్తుండడంతో, చంద్రబాబు పేరనేది వినపడకుండా, చంద్రబాబు గుర్తులేవీ కనపడకుండా చేసేందుకు  జగన్ ప్రయత్నిస్తున్నట్టు కనపడుతుంది. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సహజం. అలాగని పూర్తి సమయాన్ని కేవలం ఆ పనికోసమే కేటాయిస్తే అవి కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు. 

మచ్చుకి పోలవరం ప్రాజెక్టు విషయాన్ని తీసుకుంటే, పాత టెండర్లను రద్దు చేసే తతంగాన్ని పరిశీలిస్తే, అవినీతిని ఎండగట్టడం అనే కార్యక్రమం వల్ల ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమవుతున్నకొద్దీ నిర్మాణ వ్యయం భారీ స్థాయిలో పెరుగుతుంది. 

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దాదాపుగా ఖాళి అయ్యింది. జీతాలు మినహా ఇతర బిల్లులను చెల్లించొద్దని మొన్ననే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక పక్కనేమో సంక్షేమ పథకాలకు భారీ స్థాయిలో ఖర్చుచేస్తున్నారు. మద్యం రూపంలో వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తున్నారు. కొత్త పెట్టుబడులు వస్తున్న దాఖలాలు ఎక్కడా కనపడట్లేదు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనని తేల్చి చెప్పింది. పోనీ నిధులనన్నా ఇబ్బడి ముబ్బడిగా విడుదల చేస్తుందా అంటే,అదీ లేదు. బీజేపీ నేరుగా రాష్ట్రంలో ప్రతిపక్షంగా నిలదొక్కుకోవాలనే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇలాంటి తరుణంలో వారు జగన్ సర్కార్ కు ఇబ్బందులు కలిగించేందుకు నిధుల్లో కోత విధిస్తారే తప్ప పెంచరు.  

భారత ఆర్ధిక వ్యవస్థే మందగమనంలో నడుస్తోంది. నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ఠంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ దీనికి అతీతమేమి కాదు. ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే నూతన ఆదాయ మార్గాలను అన్వేషించడంతోపాటు నూతన పెట్టుబడులకు సానుకూల వాతావరణాన్ని తక్షణం కల్పించాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios