ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. విద్యారంగంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. విద్యారంగంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించి విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో ఏఐ భాగం కావాలని అన్నారు.
వైద్య విద్యలో ఆర్ఠిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని అన్నారు. అధునాతన పద్దతిలో వైద్య విద్యార్థులకు బోధన ఉండాలని చెప్పారు. మన విద్యార్థులు క్రియేటర్లుగా ఉండాలని.. ఫాలోవర్లుగా కాదని అన్నారు. విద్యార్థులకు కావాల్సిన కోర్సులు, లెర్నింగ్ ఆప్షన్స్‌పై చర్చించాలని తెలిపారు. రానున్న రోజుల్లో సిలబస్, పరీక్షా విధానం సమూలంగా మార్చే అవకాశం ఉందని చెప్పారు.
‘‘జర్మనీ లాంటి దేశంలో నైపుణ్యం కలిగిన మానవవనరుల కొరత ఉందని చెప్పారు. పాశ్చాత్య ప్రపంచం అంతా డెమోగ్రఫిక్ ఇన్‌బ్యాలెన్స్ ఎదుర్కొంటోంది. మనదేశంలో, మన రాష్ట్రంలో సుమారు 70శాతం మంది పనిచేసే వయస్సులో ఉన్నారు. వీరికి సరైన నాలెడ్జ్, స్కిల్స్ ఇవ్వలేకపోతే మనం ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా ఉండలేం. ఇది వాస్తవం. అందుకే విద్యారంగంలో మార్పులకు మనం శ్రీకారం చుట్టాలి. ఏ రకమైన మార్పులకు శ్రీకారం చుడితే.. మనం అనుకున్నట్టు ఫలితాలు ఉంటాయి, విద్యారంగంలో ఇంకా మెరుగ్గా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై ఆలోచనలు చేయాలి’’ అని సీఎం జగన్ అన్నారు. ఉన్నత విద్యా రంగంలో వైస్‌ఛాన్సలర్లది కీలక పాత్ర అని చెప్పారు.
ప్రశ్నా పత్నం విధానం మారాలని జగన్ అన్నారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్ గాని చూస్తే.. వీళ్ల పాఠ్యపుస్తకాలు, వీళ్ల బోధనా పద్ధతులు, ప్రశ్నపత్రాలు రూపొందించే విధానం.. చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పారు. మన పిల్లలకు మంచి సబ్జెక్ట్ జ్ఞానం ఉండొచ్చు.. కానీ వెస్ట్రన్ దేశాల మాదిరిగానే అక్కడ రూపొందించే ప్రశ్నలకు సమాధానాలు నింపే పరిస్థితుల్లో ఉన్నారా? అన్నది చూడాలని అన్నారు. ప్రశ్నా పత్నం విధానం మారాలి. వెస్ట్రన్ వరల్డ్ ఎలా బోధిస్తుందన్నది మన కరిక్యులమ్‌లోకి రావాలని.. ఇవేమీ చేయకపోతే మనం వెనకబడి ఉంటామని చెప్పారు. అక్కడ పాఠ్యపుస్తకాలు కూడా పిల్లలకు ఇచ్చి.. సమాధానాలు రాయించి.. ప్రాక్టికల్ అప్లికబిలిటీ ఉందా? లేదా? అని చూస్తారని తెలిపారు. మనం ప్రాక్టికల్ అప్లికబులిటీ ఆఫ్ నాలెడ్జ్‌ను తీసుకునిరావడం లేదని అన్నారు. అందుకే ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలని చెప్పారు.
