విశాఖపట్టణం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖపట్టణంలోని కోపరేటివ్  రంగంలో అన్ని షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లా చోడవరంలో పాదయాత్ర చేస్తున్న జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖపట్టణంలోని ఏ ఫ్యాక్టరీ తెరచుకోలేదని దుయ్యబుట్టారు. 

ఒకప్పుడు లాభాల్లో ఉన్న చోడవరం షుగర్ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు 45 కోట్ల రూపాయలు అప్పుల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 45 కోట్లు నష్టాల్లో ఉన్న చోడవరం షుగర్ ఫ్యాక్టరీని 45 కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. మళ్లీ చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక చోడవరం షుగర్ ఫ్యాక్టరీ వంద కోట్లు నష్టాల్లోకి నెట్టేశారని జగన్ ఆరోపించారు. 

లాభాల్లోకి తీసుకు రావాల్సిన ముఖ్యమంత్రి తన బినామీలతో షుగర్ ఫ్యాక్టరీని దోచేస్తున్నారని దుయ్యబుట్టారు. తడిసిన పంచదార పేరుతో ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు బినాబీ ఎంపీ సుజనా చౌదరి బంధువుకు అతితక్కువ ధరకే షుగర్ కట్టబెట్టారని మండిపడ్డారు. మార్కెట్లో క్వింటా షుగర్ 3వేలు ఉంటే కేవలం 1100కే కట్టబెట్టారని ఇలా చేస్తే షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడ లాభాల్లోకి వస్తుందని ప్రశ్నించారు.  

అలాగే టన్న మెులాసిస్ ధర మార్కెట్లో 6వేలు ఉంటే దాన్ని కేవలం 2,700 రూపాయలకే కట్టబెట్టడంతో 20 కోట్లు షుగర్ ఫ్యాక్టరీకి నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ బాగుపడాలన్నా....రైతులు బాగుపడాలన్నా చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని కోరారు. జగన్ అనే నేను ప్రతీ రైతన్నకు హామీ ఇస్తున్నా.....విశాఖలోని కార్పొరేట్ రంగంలో ఉన్న అన్ని చక్కెర కర్మాగారాలు తెరిపిస్తానని హామీ ఇస్తున్నా అంటూ డైలాగులు చెప్పారు.  

మరోవైపు షుగర్ ఫ్యాక్టరీ భారీగా బకాయిలు ఉండటం వల్ల రైతులు చెరకు అమ్ముకోలేక బెల్లం తయారు చేస్తుంటే ఆ బెల్లానికి కూడా కనీస మద్దతు ధర ఉండటం లేదన్నారు. ఫలితంగా బెల్లం ఉత్పత్తి కూడా తగ్గిపోయిందన్నారు. క్వింటా బెల్లానికి కనీసం 2వేలు కూడా రాని పరిస్థితన్నారు. అదే బెల్లం  హెరిటేజ్ షాపుల్లోకి కేజీ 84 రూపాయలకు అమ్ముతున్నారని మండిపడ్డారు. 

24వేల మంది కార్మికులు షుగర్ ఫ్యాక్టరీలపై ఆధారపడి బతుకుతుంటే వాటిని పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కోపరేటివ్ రంగంలో ఉన్న ఏ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు బాగు పడనియ్యడని దుమ్మెత్తి పోశారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను తన బినామీలకు బిస్కట్లకు, శనక్కాయలకు అమ్మేస్తారన్నారు.