పరిహారం అందని ఒక్క రైతును కూడా దత్తపుత్రుడు చూపించలేకపోయాడు: సీఎం వైఎస్ జగన్
ఖరీఫ్ సీజన్ మొదలు కాకముందే ఈ ఏడాది ఖరీఫ్ పంటకు పెట్టుబడి సాయం వైస్సార్ రైతు భరోసాను అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. నేడు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 5,500 నేరుగా రైతన్న ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నారు.
ఖరీఫ్ సీజన్ మొదలు కాకముందే ఈ ఏడాది ఖరీఫ్ పంటకు పెట్టుబడి సాయం వైస్సార్ రైతు భరోసాను అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. సోమవారం ఏలూరు జిల్లా గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నేడు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 5,500 నేరుగా రైతన్న ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నారు. మరో రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ కింద కేంద్రం విడుదల చేస్తుందని.. ఆ డబ్బులు కూడా ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందన్నారు. మొత్తం ఈ నెలాఖరులోగా 50 లక్షలపైగా రైతన్నల ఖాతాల్లోకి రూ. 3,758 కోట్లు జమ అవుతాయని చెప్పారు.
మే నెలలో జమచేయనున్న మొత్తాన్ని కలుపుకుంటే.. మూడేళ్లలో వైస్సార్ రైతు భరోసా కింద రూ. 23,875 కోట్లను నేరుగా రైతన్నల బ్యాంక్ అకౌంట్లలో వేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఈ మూడేళ్లలో కరువు అనేది లేదని అన్నారు. మూడేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. దేవుడి దయతో ప్రతి రిజర్వాయర్ సకాలంలో నిండిందన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలోని గ్రౌండ్ వాటర్ లెవల్స్ పెరిగాయని చెప్పారు. అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయని తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న రైతన్నలకు రూ. 7 లక్షలు చెల్లిస్తున్నామని చెప్పారు. సీసీఆర్సీ కార్డు ఉన్న కౌలు రైతులకు కూడా రూ. 7 లక్షల పరిహారం అందజేస్తున్నామని తెలిపారు. వ్యవసాయం దండగ అన్న నాయకుడు.. నేడు రైతుల గురించి మాట్లాడున్నాడని ఎద్దేవా చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు దత్త పుత్రుడు రైతు భరోసా అంటూ బయలుదేరాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. పరిహారం అందని ఒక్క రైతుని కూడా దత్తపుత్రుడు చూపించలేకపోయాడని విమర్శించారు.
పంట నష్టం జరిగిన రైతులకు ఇన్సురెన్స్ డబ్బులను సకాలంలో జమ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇంత సహాయపడిన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పంట పరిహారం అందజేసిన దాఖలాలు లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పంట సీజన్ ముగిసేలోగా పరిహారం అందజేస్తున్నామని చెప్పారు. రైతన్నలకు ప్రతి అడుగులో తోడుగా ఉంటున్నామని తెలిపారు.
రైతులను కాల్పులు జరిపి చంపించిన నాయకుడు, రుణాలను మాఫీ చేస్తానని మోసం చేసిన నాయకుడి పాలనను గుర్తుచేసుకోవాలని కోరారు. ప్రశ్నించాల్సిన సమయంలో చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదని..? అని అడిగారు. చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే.. ఈ దుష్టచతుష్టయం ఎందుకు ప్రశ్నించలేదన్నారు.
అక్వా జోన్‌లో ఉన్న 10 ఏకరాల వరకు రూపాయిన్నర విద్యుత్ సబ్సిడీ వర్తించేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాను రాజకీయాల గురించి ఆలోచించనను.. ప్రజలకు మంచి చేయాలనేదే తన తపన అని చెప్పారు. తాను ఎన్నికలప్పుడు ఒకలా, ఎన్నికలు అయ్యాక మరోలా ఉండే వ్యక్తిని కాదని అన్నారు.
గణపవరంను భీమవరం జిల్లాలో కలుపుతాం..
ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కోరినట్టుగా గణపవరంను భీమవరంలో కలపుతామని సీఎం జగన్ చెప్పారు. కొల్లేరు ప్రాంతంలో రీసర్వే చేయించాలని ఆదేశించామని.. రాబోయే రోజుల్లో అవన్ని అమలవుతాయని చెప్పారు. కొల్లేరు రెగ్యూలేటర్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తైందని.. జూన్ నెలలో వచ్చి శంకుస్థాపన చేయనున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు.
ఇక, ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఏటా మూడు విడతల్లో కలిపి రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. తొలి విడుతగా ఖరీఫ్ సీజన్‌కు ముందు రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో మిగిలిన రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు కూడా ఈ సాయాన్ని వర్తింపజేశారు.