విశాఖపట్నం: తన చిన్ననాటి స్నేహితుడు, క్లాస్ మేట్ వైఎస్ జగన్ పై అభిమానాన్ని చాటుకోవాలని ఏడిద జగదీష్ అనే ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు మరో వ్యక్తి కూడా ప్రమాదంలో మరణించాడు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఆ సంఘటన చోటు చేసుకుంది. 

అనకాపల్లిలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఏడిద జగదీష్ బాల్యంలో వైఎస్ జగన్ తో కలిసి హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆయనకు జగన్ అంటే తెగ అభిమానం. తాను పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ జగన్ ఆయనను కలిశారు కూడా.

చిన్నతనంలో తాము కలిసి చదువుకున్నప్పటి ఫోటోలతో, పాదయాత్రలో పాల్గొన్నప్పుడుకలిసి దిగిన ఫొటోలతో జగదీష్ ఓ భారీ ఫ్లెక్సీ తయారు చేయించారు. ఈ ఫ్లెక్సీని ఇంటి ముందు కట్టడం కోసం గురువారంనాడు డాబా మీదికి వెళ్లారు. దూరపు బంధువు ముప్పిడి శ్రీను అతనికి సాయంగా వచ్చారు. 

ఇద్దరు కలిసి ఫ్లెక్సీ కడుతుండగా ఒక్కసారిగా గాలి వీచింది. దాంతో ఇంటి ముందు ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలపై ఫ్లెక్సీ పడింది. విద్యుత్ తీగల నుంచి కరెంట్ ప్రసారం కావడంతో వారికి షాక్ తగిలింది. వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే జగదీష్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ముప్పిడి శ్రీను చికిత్స పొందుతూ మరణించాడు. 

ఆ సంఘటనతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో విషాద ఛాయలునెలకొన్నాయి. జగదీష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆయన భార్యకు దూరంగా ఉంటున్నారు.