విజయవాడలో వైసీపీ విస్తృస్థాయి సమావేశం.. హాజరైన సీఎం జగన్.. ప్రసంగంపై ఉత్కంఠ..
విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో అధికార వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు.

విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో అధికార వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ సభ వేదిక నుంచి వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ప్రసంగం ఏ విధంగా ఉండనుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక, ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్, రీజినల్ కో ఆర్డినేటర్లు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం,మండల స్థాయి ముఖ్య నాయకులతో కలిసి 8,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ముందుగా జారీ చేసిన పాసులు ఉన్నవారిని మాత్రమే సమావేశం జరుగుతున్న చోటుకు అనుమతించారు. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా వంటకాలను సిద్దం చేశారు. వారికి చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ 65లతో పాటు పలు రకాల నాన్ వెజ్ ఐటమ్స్.. అలాగే పలు వెజ్ ఐటమ్స్ కూడా సిద్దం చేశారు.
ఈ సందర్బంగా రానున్న ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వై ఏపీ నీడ్స్ జగన్..అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింతగా వివరించేలా జగన్ సూచనలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం జగన్ మాట్లాడే అవకాశం ఉంది. అదే సమయంలో టీడీపీ, జనసేన విమర్శలను బలంగా తిప్పికొట్టడంపై కూడా వైసీపీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే టీడీపీ-జనసేన పొత్తు ఖరారు కావడంతో.. రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు పోటీగా ప్రజల్లోకి వెళ్లేలా వైసీపీ శ్రేణులకు జగన్ మార్గనిర్దేశం చేయనున్నారు.