కడప: కడప జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను జగన్ ప్రకటించారు. జమ్మలమడుగు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు  పోటీ చేసే  అభ్యర్థుల పేర్లను ప్రకటించి వారి గెలుపు కోసం ప్రయత్నించాలని పార్టీ శ్రేణులను కోరారు. 

కడప జిల్లాలో వైసీపీ ప్రాబల్యం తగ్గించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే జిల్లాలో తమ ఆధిపత్యాన్ని  కొనసాగించేందుకు వీలుగా జగన్ ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోటీ చేసే అభ్యర్థుల పేర్లను జగన్ ఆదివారం నాడు ప్రకటించారు.

కడప జిల్లాలోని  జమ్మలమడుగు  అసెంబ్లీ స్థానం నుండి సుధీర్ రెడ్డి, మైదుకూరు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలను వైసీపీ అభ్యర్థులుగా వచ్చే ఎన్నికల్లో  బరిలోకి దిగుతారని  జగన్  పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు.

సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించిన జగన్ రెండు రోజుల పాటు  పులివెందులలో  ప్రజా దర్బార్ నిర్వహించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు జగన్ ను కలిశారు.  అనుచరులతో కలిసి జమ్మలమడుగు ఇంచార్జీ సుధీర్ రెడ్డి జగన్‌ను కలిశారు. సుధీర్ రెడ్డికి ఈ దఫా టిక్కెట్టు ఇవ్వాలని ఆయన అనుచరులు జగన్‌ను కోరారు. మీకు ఇష్టమైతే సుధీర్ రెడ్డే మీ అభ్యర్థి అని జగన్ ప్రకటించారు. సుధీర్ రెడ్డిని గెలిపించుకొని రావాలని జగన్ పార్టీ శ్రేణులను కోరారు.

ఈ విషయమై ప్రభావతితో పాటు ఆమె అనుచరులు కూడ  జగన్‌ను కలిశారు. జమ్మలమడుగు టిక్కెట్టును ఇవ్వాలని కోరారు. అయితే జమ్మలమడుగు టిక్కెట్టు సుధీర్ రెడ్డికే ఇస్తానని ప్రకటించినట్టు జగన్ చెప్పారు. ప్రభావతితో పాటు ఆమె అనుచరులను జగన్ సముదాయించే ప్రయత్నం చేశారు.

సుధీర్ రెడ్డిని గెలిపించుకొని వస్తే ప్రభుత్వం ఏర్పడితే ప్రభావతికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సుధీర్ రెడ్డికే మద్దతిస్తామని ప్రభావతిని మీడియాకు చెప్పాలని జగన్ కోరారు.

మైదుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇస్తున్నట్టు జగన్ ప్రకటించారు. రఘురామిరెడ్డి గతంలో టీడీపీ అభ్యర్ధిగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరో సారి ఆయన వచ్చే ఎన్నికల్లో  వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు.