Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో పెన్షన్ పెంపుపై జగన్ కీలక ప్రకటన.. రూ. 3 వేలు ఎప్పటినుంచంటే..

ఆంధ్రప్రదేశ్‌లో వృద్దులు, వితంతువులకు పెన్షన్ పెంపుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు.

YS jagan Announces pension hike to rs 3000 from january 1st ksm
Author
First Published Oct 9, 2023, 4:01 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో వృద్దులు, వితంతువులకు పెన్షన్ పెంపుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ పెంపు ఉంటుందని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పెన్షన్ పెంపుపై ప్రకటన చేశారు. అవ్వతాతలకు, వితంతువులకు రూ. 3 వేల వరకు పెన్షన్ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. జనవరి 1 నుంచి రూ. 3 వేలకు పెన్షన్ పెంపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జనవరి 1 నుంచి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని.. గ్రామ స్థాయిలో సంబరాలు జరగాలని అన్నారు. 

వైసీపీ అధికారంలోకి రాకముందు ఏపీలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారని జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు 66 లక్షలమందికి పించన్లు ఇస్తున్నామని తెలిపారు. నెలకు రూ. 2 వేల కోట్ల భారం చిరునవ్వుతో భరిస్తున్నామని జగన్ చెప్పారు. 

ఇక, అదే సభలో జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ తన కుటుంబ సభ్యులేనని తెలిపారు. అధికారాన్ని తాను బాధ్యతగా భావించినట్టుగా చెప్పారు. అందుకే ప్రజలకు తొలి సేవకుడిగా బాధ్యతగా వ్యవహరించానని చెప్పారు. 52 నెలల కాలంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విప్లవవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని చెప్పారు. గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని తెలిపారు. స్థానిక సంస్థల నుంచి కేబినెట్ వరకు సామాజిక న్యాయం పాటించామని చెప్పారు. సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశామని తెలిపారు. 

మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానుల ప్రకటనను చేశామని చెప్పారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను అమలు  చేశామని చెప్పారు. నాలుగేళ్ల పాలనలో జగన్ చెప్పాడంటే చేస్తాడనే మంచి పేరును తెచ్చుకోవడం జరిగిందని తెలిపారు. 

రూ. 2 లక్లల 35 వేల కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా లబ్దిదారులకు నేరుగా అందించామని చెప్పారు. నాలుగేళ్లలో 2 లక్షల 7 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇందులో 80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చామని చెప్పారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. 22 లక్షల ఇళ్లు అక్కాచెల్లమ్మల పేరుతో కడుతున్నామని చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.  

వైసీపీ తప్ప ప్రజలకు ఇచ్చిన మాటను, మేనిఫెస్టోను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదని చెప్పారు. నాలుగేళ్లలో పరిపాలనలో, వ్యవస్థలో ఇన్ని మార్పులు తీసుకొచ్చిన దేశ చరిత్రలో మరెక్కడా లేదని సగర్వంగా తెలియజేస్తున్నానని తెలిపారు. పేదవాడి గురించి ఆలోచించి.. వారి గురించి నిలబడిన ప్రభుత్వం తమదని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios